జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యాత్ర చేస్తూ, కవాత్తులు నిర్వహిస్తూ, అధికార టిడిపి, చంద్రబాబు, లోకేష్‌లపై మరోవైపు ప్రతి పక్షమైన వైసీపీని, జగన్‌ని కూడా విమర్శిస్తున్నారు. ఆయన జనసేన అధినాయకుడు కావడం వల్ల ఆయన ఇతరులపై చేసే విమర్శలను ఎవ్వరూ తప్పుపట్టలేరు. అందునా ఆయన వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ఏపీలోని 175 నియోజకవర్గాలలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక విషయానికి వస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ఓ ప్రెస్ నోట్‌ని రిలీజ్ చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఆరున్నర దశాబ్దాల కల అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సుసంపన్నం కావాలంటే అందరు కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు. నిజమే... ఏ రాష్ట్రమైనా కలిసి కట్టుగా ఉంటేనే అభివృద్ది సాధ్యమవుతుంది. ప్రజల కష్టాలు, కడగండ్లు తీరుతాయి. ఈ విషయంలో పవన్ చెప్పింది నిజమే.
కానీ నేడున్న కుళ్లు రాజకీయ వ్యవస్థలో ఎవరి ఓట్ బ్యాంకు రాజకీయాలు వారు చేస్తున్నప్పడు.... ఒకరిని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం, ప్రభుత్వాలు చేసే మంచి పనులను సైతం తప్పు పట్టే విపక్షాలు ఉన్న చోట రాజకీయంగా ఐక్యంగా పోరాడటం కుదిరే పనికాదు. మరి కలిసికట్టుగా ఉండాలని పవన్ తెలంగాణకు ఇచ్చిన పిలుపును ఆయనెంతగా ఆచరిస్తున్నాడు? అనేది సందేహాస్పదం. టిడిపి, వైసీపీలు ఇష్ట పూర్వకంగా గానీ లేదా మరో కారణాల వల్ల గానీ ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నాయి. మరి వాటితో కలిసి చంద్రబాబు ఎందుకు పాల్గొని కలిసి కట్టుగా ఏపీ ప్రయోజనాల కోసం ఉద్యమించడం లేదు? కేంద్రంపై ఎందుకు తన వాయిస్‌ని వినిపించడంలో విఫలమవుతున్నాడు? అనేది ప్రశ్నార్దకం.
అవిశ్వాస తీర్మానం పెడితే దేశం మొత్తం తిరిగి, సీపీఎం , సీపిఐ నుంచి తృణముల్, కాంగ్రెస్‌ల మద్దతు కూడా కూడగడుతానని చెప్పిన పవన్ ఇప్పుడు ఆ ప్రస్తావనే ఎందుకు తేవడం లేదు? ఒక్క ప్రత్యేకహోదా విషయంలోనైనా ఆయన ఇతర పార్టీలతో కలసి ఎందుకు పనిచేయలేకపోతున్నాడు? కేంద్రం చేతిలో కీలుబొమ్మగా వారికి లబ్ది చేకూర్చేలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వంటి ప్రశ్నలన్నీంటికీ పవన్ వద్ద సమాధానం ఉందా....?