సినిమా పరిశ్రమలో నిజమైన బంధాలు, అనుబంధాలు చాలా తక్కువగానే ఉంటాయి. అందరు అన్ని విషయాలను కమర్షియల్ యాంగిల్‌లోనే చూస్తారు. కానీ తెలుగులో 'ఖడ్గం, పెళ్లాం ఊరెళితే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి' వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు నటి సంగీత సుపరిచితురాలు ఆమె 1997లో మలయాళ చిత్రం 'గంగోత్రి' ద్వారా నటిగా పరిచయం అయింది. ఇక ఈమె తాజాగా మాట్లాడుతూ, మాకు, తమిళ స్టార్ విజయ్ కుటుంబంతో ఎంతో మంచి అనుబంధం ఉంది. విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ అంకుల్ మా తాతయ్య నిర్మాణం వహించిన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఇక నేను హీరోయిన్‌ని కావాలని భావించిన తర్వాత విజయ్ రెండో లేదో మూడో చిత్రంలో నాకు హీరోయిన్ అవకాశం వచ్చింది. మా అమ్మ విజయ్‌తోనే నా పరిచయం జరగాలని భావించింది. కానీ అది వీలు కాలేదు. ఇక నేను నాడు పలు షోలలో డ్యాన్స్‌లు చేసే దానిని. అలా నేను చేసిన ఓ షోకి విజయ్‌గారు వచ్చి నన్నుచూశారు. నాటి నుంచి మామధ్య స్నేహం పెరిగింది. ఆయన నా బాగోగులన్నీ చూసుకునే వారు. ఎవరితోనైనా ప్రేమలో పడతావేమో జాగ్రత్త అన్ని హెచ్చరించేవారు. నా మీద ఏమైనా గాసిప్స్ వస్తే ఫోన్ చేసి విషయం కనుక్కునే వారు. నాపై అంతగా అభిమానం చూపించారు.
ఇక నేను క్రిష్ అనే వ్యక్తితో ప్రేమలో పడి, పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు విజయ్‌కి క్రిష్‌ని పరిచయం చేశాను. ఆయన గట్టిగా కౌగిలించుకుని క్రిష్ ఎంతో మంచి వాడిలా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంది. మీ జంట బాగుంది అని కితాబునిచ్చారు. మరో విశేషం ఏమిటంటే నాభర్త క్రిష్ అసలు పేరు విజయ్. ఇక విజయ్ గారి భార్యపేరు సంగీత. ఇది కాకతాళీయమే అయినా ఆలోచిస్తే ఎంతో థ్రిల్లింగ్‌గా, ఆశ్చర్యంగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది.