తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, ఎవరిపైనైనా ముక్కుసూటిగా నిజాయితీగా ఓపెన్ మైండ్‌తో మాట్లాడటం, తాను చేయదలుచుకున్నది గుప్తంగా చేయడంలో రచయిత, దర్శకుడు, నటుడు పోసానికి తిరుగేలేదు. ఇక ఈయన తన చిన్నతనంలో చదువుకోసం ఎన్నోకష్టాలు పడ్డాడు. ఏడవ తరగతి ఫెయిల్ అయితే తనను గేదెలను మేపమంటారనే భయంతో చదివి పాసయ్యాడు. ఇక కళాశాలలో చేరేనాటికి ఆయనకు ఎన్నో కష్టాలు. హాస్టల్‌లో ఉంటూ సమయం చూసుకుని పూల బుట్టలపై కుట్టే గోతాలు కుట్టి, పక్కనే ఉన్న సినిమా థియేటర్‌లో టిక్కెట్లు అమ్మి, అర్ధరాత్రి లారీ ఎక్కి ఇంటికి చేరుకునే వాడు. ఇక ఈయన సినిమాలలోకి వచ్చిన తర్వాత 15మందికి గుండె ఆపరేషన్లు చేయించారు. ఇప్పుడు వారంతా ఆరోగ్యంగా ఉన్నారు.
ఇక విషయానికి వస్తే ఒకరోజు బన్నీ పోసాని కృష్ణమురళిని పిలిచి, మీరు 30ఏళ్లుగా ఎంతో సేవ చేస్తున్నారని విన్నాను. కాదనకుండా ఈ ఐదు లక్షలు తీసుకుని పదిమందికి సహాయపడమని చెప్పారు. దాంతో కాదనలేక ఆ డబ్బును పోసాని తీసుకున్నారు. అదే సమయంలో మంచి విద్యాకుసుమాలు అయిన రష్మిత, రాజేశ్వరి, షకినాబి అనే విద్యార్ధినులు ప్రభుత్వ స్కూల్‌లో చదువుకుంటూ పదో తరగతిలో మంచి మార్కులతో పాసై, ఆపై చదువులకు స్థోమత లేకపోవడంతో పోసాని ముందుకు వచ్చి బన్నీఇచ్చిన 5 లక్షలతో ఒక్కో విద్యార్ధికి ఒకటిన్నర లక్ష చొప్పున విరాళం ఇచ్చి, వారి డిగ్రీ ఖర్చుల వరకు తానే చూసుకుంటానని హామీ ఇచ్చాడు.
ఇక మంచి బట్టలు కొనుక్కుని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం కోసం ఈ ముగ్గురు విద్యార్ధినులకు ఆయన విడిగా 10వేల రూపాయల చొప్పున ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ మంచి పని బన్నీ వల్లనే జరిగిందని, బన్నీ దూతగా వచ్చాడని పోసాని ప్రశంసల వర్షం కురిపించారు.