మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్‌మూవీ, ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రం 'ఖైదీనెంబర్ 150' విడుదలై సంవత్సరం దాటింది. ఆ తర్వాత ఆయన 151వ చిత్రంగా తొలిస్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా 'సై..రా..నరసింహారెడ్డి'ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన కుమారుడు రామ్‌చరణ్ నిర్మాతగా 'కొణిదెల ప్రొడక్షన్స్'పై నిర్మిస్తున్నారు. ఈచిత్రం చారిత్రాత్మక పీరియాడికల్, భారీ బడ్జెట్ చిత్రం కావడంతో పాటు షూటింగ్ మొదలు కావడమే ఆలస్యమైంది. ఇక ఇందులో అమితాబ్, కిచ్చాసుదీప్, విజయ్‌సేతుపతి, నయనతార, తమన్నాతో పాటు పలు భాషా ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే ఒక్క షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీంతో 30శాతం వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలో రెండో షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నారు.
'బాహుబలి' రేంజ్‌లో తీయాలని నిర్ణయించడంతో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, దేశంలోని ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయాల్సి ఉండటంతో ఈ చిత్రం పూర్తి కావడానికి చాలా కాలమే పట్టేట్లు కనిపిస్తోంది. దాంతో మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈయన్ను కలిసి తాజాగా కొరటాల శివ మంచి సందేశాత్మక స్టోరీని చెప్పాడు. స్టోరీ లైన్ నచ్చడంతో చిరు కొరటాలను పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడు. సో... 'సైరా..నరసింహారెడ్డి'తో పాటు కొరటాల శివ చిత్రాన్ని కూడా ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని, తద్వారా ఎక్కువ గ్యాప్ ఇస్తే అభిమానులు అసంతృప్తిగా ఫీలవుతారనే ఉద్దేశ్యంతో ఆయన ఈ విధంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
కొరటాల చిత్రం కూడా అక్టోబర్ నుండే సెట్స్‌పైకి వెళ్తుందని, సైరా గెటప్ విషయంతో తేడాలు రాకుండా షెడ్యూల్స్‌ని ప్లాన్ చేయాలని ఆయన కొరటాలను కోరాడట. అదే నిజమైతే చిరంజీవి నటించే 151వ చిత్రంగా ఏ చిత్రం ముందుగా విడుదల అవుతుందనేది ఆసక్తికర విషయం. మరోవైపు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నుంచి రజనీకాంత్ వరకు ఇప్పుడు ఒకేసారి ఒక సినిమా అని కాకుండా ఒకేసారి రెండు చిత్రాలు కూడా చేస్తుండటం విశేషంగా చెప్పాలి.