ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'కాలా' చిత్రం జూన్ 7వ తేదీన విడుదల కానుంది. ముంబైలోని తమిళుల కోసం పోరాడే నాయకుడి పాత్రలో కాలా కనిపించనున్నాడు. ఇక రజనీ రాజకీయ ఎంట్రీ ఖరారైంది. ఈ సందర్భంగా ఆయన కేవలం సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని మాత్రమే కర్ణాటకను కోరారు. ఇక రజనీ విషయానికి వస్తే ఆయన పుట్టింది మహారాష్ట్రలో, పెరిగింది కర్ణాటకలో, సినిమాలలో స్టార్‌గా ఎదిగింది తమిళనాడులో. కాబట్టి పట్టమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపంలా తయారైంది రజనీ పరిస్థితి.
కావేరి జలాల వ్యాఖ్యల నేపధ్యంలో కన్నడిగులు మండిపడుతున్నారు. దాంతో పౌరసంఘాలు, ప్రజా సంఘాలు, కన్నడ సంఘాలు, కర్ణాటకకు చెందిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏకతాటిపైకి వచ్చారు. రజనీ నటించే 'కాలా' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కాకుండా కర్ణాటక ఫిలించాంబర్ నిర్ణయం తీసుకుంది. అయినా కావేరి జలాలకు కాలా విడుదలకు మద్య లింక్ పెట్టడం సరికాదనే చెప్పాలి. 'బాహుబలి-ది కన్‌క్లూజన్' సమయంలో కూడా సత్యరాజ్ కావేరి జలాలపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కానివ్వమని చెప్పారు. కానీ సత్యరాజ్, నిర్మాతలు కర్ణాటక ఫిలించాంబర్‌తో మాట్లాడి విషయాన్ని సెటిల్ చేశారు.
ఇక 'కాలా' విషయానికి వస్తే కర్ణాటకలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనివ్వబోమని ప్రకటించడంపై నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళనాడు నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ స్పందించాడు. 'కాలా' సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేయడం అనైతికం. సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవడం అంటే భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకోవడమే. ఈ విషయంపై కర్ణాటక ఫిలించాంబర్ పునరాలోచించాలి. సామాజిక అంశాలకు, సినిమాలకు ముడి పెట్టడం సమంజసంకాదని చెప్పాడు. ఇక విశాల్ గతంలో కర్ణాటకలో కన్నడ గడ్డ మీదనే కావేరి సమస్యపై స్పందించాడు. ఏది ఏమైనా దక్షిణాదిలోని నదులన్నింటినీ రజనీ చెప్పినట్లు అనుసంధానం చేయడమే రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలకు పరిష్కారమని చెప్పాలి.