దర్శకరత్న, నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, రాజకీయనాయకుడు, సినీ పెద్ద ఇలా అన్ని తానే అయిన గురువు దాసరి మరణించి అప్పుడే ఏడాది అయిపోయింది. ఆయన మొదటి వర్ధంతి వచ్చింది. ఎవరైనా ఉన్నప్పుడు వారి విలువ తెలియదు. వారు లేని నాడే వారి అసలు విలువ తెలుస్తుంది అనే నిజం టాలీవుడ్‌కి కొద్దిరోజుల్లోనే తెలిసి వచ్చింది. డ్రగ్స్ కేసు, కత్తిమహేష్, పవన్ అభిమానుల వార్, శ్రీరెడ్డి వ్యవహారం వంటి విషయాలలో టాలీవుడ్ పరువు రోడ్దు మీద పడింది. అదే దాసరి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనేది వాస్తవం.
ఇక దాసరి ప్రధమ వర్దంతి సందర్భంగా రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేస్తూ...'ఎక్కడికి వెళ్లారు మీరు గురువు గారూ...! చలన చిత్ర పరిశ్రమలోని ప్రతి శాఖలోని ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నారు.. ఉంటారు....మీ అడుగు జాడల్లో నడుస్తూ, మీరు చూపించిన పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఉంటాం. మీకు జోహార్లు' అని ట్వీట్ చేశాడు. ఇక దాసరి ప్రియశిష్యుడు, ఆయన ద్వారా నటునిగా పరిచయం అయిన మోహన్‌బాబు ట్వీట్ చేస్తూ, అనుక్షణం మా కళ్లలో మీరు సజీవంగా ఉన్నారు. నా కుటుంబానికి ఆశీస్సులు అందిస్తూనే ఉన్నారు... అంటూ నివాళి తెలుపుతూ దాసరితో కలిసి ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. దాని గురించి మోహన్‌బాబు ఏమీ చెప్పలేదు గానీ ఆ స్టిల్ మోహన్‌బాబు, దాసరి నటించిన 'పుణ్యభూమి నాదేశం' చిత్రంలోనిది. బాలీవుడ్ 'క్రాంతివీర్'కి రీమేక్‌గా ఇది కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుని పెద్దగా విజయం సాధించలేదు.
ఇక దాసరి విషయానికి వస్తే ఆయన తన చివరికాలంలో 'మహాభారతం'ను నాలుగైదు భాగాలుగా తీయాలని ఆశపడ్డారు. పవన్‌కళ్యాణ్‌తో ఓ చిత్రం, జయలలిత జీవిత చరిత్రగా 'అమ్మ', 'పితృదేవో భవ:, స్వామి అయ్యప్ప మహత్మ్యం, అసెంబ్లీలో దొంగలు పడ్డారు' వంటి పలు చిత్రాలను తీయాలని భావించినా అవి కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమే కాదు.. తెలుగు ప్రేక్షకులకు తీరనిలోటుగా చెప్పాలి.