తెలుగులో పేద హీరో, మరో వైపు గొప్పంటి హీరోలు స్నేహితులు కావడం, పేదవాడైన వ్యక్తికోసం ధనవంతుడైన హీరో ఏమి చేశాడనే పాయింట్‌తో ఎన్నోచిత్రాలు వచ్చాయి. కృష్ణంరాజు, శరత్‌బాబు నటించిన 'ప్రాణస్నేహితులు', వెంకటేష్, సుమన్ నటించిన 'కొండపల్లిరాజా', రజనీకాంత్, జగపతిబాబు నటించిన 'కుశేలన్' అలియాస్ 'కథానాయకుడు' వంటి చిత్రాలెన్నో ఆ కోవకి వస్తాయి.
ఇక తాజాగా విషయానికి వస్తే మహేష్‌బాబు చాలా కాలం తర్వాత 'భరత్ అనే నేను'తో పెద్ద హిట్ కొట్టాడు. దాంతో ఎంతో హ్యాపీగా ఈ సమ్మర్ వెకేషన్స్‌ని ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈయన హైదరాబాద్ వచ్చిన వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు-అశ్వనీదత్‌లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన తన 25వ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 8 లేదా 10వ తేదీలలో ఈ చిత్రం షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, ముస్సోరి వంటి ప్రాంతాలలో చిత్రీకరించనున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో వేసవి తాపం ఇంకా తగ్గకపోవడంతో ఈ చిత్రం షెడ్యూల్‌ని హిల్‌స్టేషన్‌లో ప్లాన్ చేశారు. ఇక ఈ చిత్రంకోసం దిల్‌రాజు, వంశీపైడిపల్లి, దేవిశ్రీప్రసాద్‌లు కలిసి ఇప్పటికే నాలుగు ట్యూన్స్‌ని రెడీ చేశారట. ప్రస్తుతం వీటికి సాహిత్యాన్ని అందించే పనులు జరుగుతున్నాయి.
ఇక పూజాహెగ్డే.. మహేష్ సరసన నటించనున్న ఈ చిత్రంలో గొప్పంటి కృష్ణుడి వంటి పాత్రలో మహేష్‌బాబు, కుచేలుడు వంటి పేదవాని పాత్రలో అల్లరినరేష్‌లు కనిపిస్తారట. ధనవంతుడైన మహేష్, పేదవాడైన అల్లరినరేష్ జీవితాన్ని ఎలా నిలబెట్టాడు? అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో డిఫరెంట్ మేకోవర్‌లో, స్టైలిస్ హెయిర్‌స్టైల్, గడ్డం లుక్‌తో మహేష్ కనిపించనున్నాడని సమాచారం.