నేడు ఏ చిత్రం హిట్ అయినా, ఏ స్టార్ హీరో చిత్రం వచ్చినా దాని కథ తమ మూలాలలోంచి కాపీ కొట్టారనే వివాదాలు మొదలవ్వడం సాధారణం అయిపోయింది. ఇక 'నాన్‌బాహుబలి' రికార్డులను తిరగరాసిన సుకుమార్-రామ్‌చరణ్‌ల 'రంగస్థలం' చిత్రానికి కూడా ఈ కాపీ వివాదం వచ్చింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలోని మూలకథతో పాటు మరీ ముఖ్యంగా క్లైమాక్స్ తాను రాసుకున్న కథలోనిదని గాంధీ అనే రచయిత వాదిస్తున్నాడు. తన వాదనకు తగ్గట్టుగా ఆయన తన కథ కాపీని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చివరకు ఈ గొడవ రచయితల సంఘం వరకు వెళ్లింది.
రచయితల సంఘం ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఇది కాపీ రైట్ చట్టం కిందకు రాదు అని సుకుమార్‌కి అనుకూలంగా తీర్పు ఇవ్వడమే కాదు.. కావాలంటే తదుపరి చర్యల నిమిత్తం న్యాయస్థానాలకు వెళ్లమని గాంధీకి సూచించింది. దీని గురించి సుకుమార్ వివరణ ఏమిటో కూడా తెలిసింది. తాను తీసిన క్లైమాక్స్ కొత్తదేమీ కాదని, ఇలాంటి సీన్స్ గతంలో ఎన్నో చిత్రాలలో వచ్చాయి. నా చిన్నప్పుడు ధర్మయుద్దం చేసినప్పటి నుంచి ఇది నా మదిలో మెదులుతోంది.
సిడ్నీషెల్టన్ రాసిన 'ఏ స్ట్రేంజర్ ఇన్‌ది మిర్రర్', చార్లెట్ జారెట్ దర్శకత్వం వహించిన షార్ట్‌ఫిల్మ్, షారుఖ్‌ఖాన్ నటించిన 'అంజామ్' వంటి చిత్రాలలో కూడా గాంధీ పేర్కొన్న ఎక్స్‌ప్రెషనే ఉంది. ఉరితీయాల్సిన వ్యక్తి ఏ గాయం లేనప్పుడే అతడిని ఉరితీయాలనే పాయింట్‌ని కాస్త కొత్తగా రాసుకున్నానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ధర్మయుద్దంలో చిట్టిబాబే గెలిచాడు సుమా...!