'సమ్మోహనం' ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా చిత్ర యూనిట్తో సూపర్ స్టార్ కృష్ణ సరదాగా కాసేపు ముచ్చటించారు.
ఆ సరదా ప్రశ్నల సమాహారం..
మోహనకృష్ణ ఇంద్రగంటి: 'సమ్మోహనం' అనగానే మీకేమైనా జ్ఞాపకాలు వచ్చాయా? ఈ మధ్య కాలంలో స్వచ్ఛమైన తెలుగు టైటిళ్లు రావడం మళ్లీ మొదలైంది. 'రంగస్థలం', 'మహానటి' వంటివి.
కృష్ణ: 'సమ్మోహనం' అనే టైటిల్‌ని ఇంతకు ముందు ఎవరూ పెట్టలేదు. టైటిల్స్ విషయానికి వస్తే అచ్చ తెలుగు టైటిల్స్ బావుంటాయి. మేం తీసిన సినిమాలన్నిటికీ తెలుగు టైటిల్సే పెట్టాం. మేం ఎప్పుడూ అదర్ లాంగ్వేజ్ టైటిల్స్ పెట్టలేదు. 'మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు, ప్రజారాజ్యం, ఈనాడు...' అవన్నీ తెలుగు మాటలతోనే పెట్టాం.
సుధీర్: మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన లవ్ స్టోరీ ఏంటి?
కృష్ణ:- 'పండంటి కాపురం'లో రొమాంటిక్ అంశాలు చాలా ఉంటాయి. ప్రజలకు బాగా నచ్చిన సినిమా ఇది. విడుదల చేసిన 37 సెంటర్లలోనూ వంద రోజులు ఆడింది. 14 సెంటర్లలో 25 వారాలాడింది .
మోహనకృష్ణ ఇంద్రగంటి: మా విజయవాడలో జోక్ ఉండేది.. 'కృష్ణగారి సినిమాలు ప్రొజెక్టర్‌లో ఇరుక్కుపోతాయి'.. ఒకసారి థియేటర్లలోకి వస్తే అంత తేలిగ్గా పోవు అనే టాక్ ఉండేది. నేను విజయవాడలో పెరిగాను. కృష్ణగారికి అక్కడ అభిమానులు ఎక్కువండీ.
కృష్ణ: మా సొంత పిక్చర్లు ఎప్పుడు తీసినా విజయవాడకు వెళ్లేవాడిని.
ఇంద్రగంటి: 'రామ్ రాబర్ట్ రహీం' తీసినప్పుడు అలంకార్ థియేటర్ నుంచి మొత్తం దారంతా గులాబీపువ్వుల రెక్కలను పరిచి మీకు స్వాగతం పలికారు. అప్పట్లో అది పెద్ద న్యూస్.
కృష్ణ: నవయుగ వాళ్లు చేసుంటారు.
సుధీర్: మహేశ్ పుట్టినరోజు చిన్నప్పుడు ఎలా చేసేవారు?
కృష్ణ: చిన్నప్పుడు మద్రాసులో చాలా బాగా చేసేవాళ్లం. ఇప్పుడు స్టార్ అయిన తర్వాత పుట్టినరోజు చేసుకోవడం మానేశాడు.
శివలెంక కృష్ణప్రసాద్: ఇప్పుడు అభిమానులు చేస్తున్నారు.
కృష్ణ: ఆ.. అవును.. అభిమానులు చేస్తున్నారు.
శివలెంక కృష్ణప్రసాద్: మీ సంస్థ ఎంత మందికి భోజనం పెట్టిందో. పద్మాలయాలో భోజనం చేయని వారు ఉండేవారు కాదు.
కృష్ణ: మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మద్రాసులో లంచ్ అంటే సాంబార్ సాదం, తయిర్ సాదం అని పెట్టేవారు. కానీ మనం కంపెనీ పెట్టినప్పుడు 'అగ్నిపరీక్ష' నుంచే నాన్ వెజిటేరియన్‌తో ఫుల్లుగా భోజనం పెట్టడం అలవాటు చేశాం. ఆ తర్వాత మిగిలిన వాళ్లు కూడా చేశారు.
మోహనకృష్ణ ఇంద్రగంటి: అన్ని షిఫ్ట్ లు మీరే కదా సార్ చేశారు. సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు...
శివలెంక కృష్ణ ప్రసాద్: అన్నీ సాహసాలన్నీ ఆయనే చేశారు.
మోహనకృష్ణ ఇంద్రగంటి: 70 ఎం ఎం అంటే విజయవాడలో... మాకు లార్జ్ 70 ఎంఎం అని అప్పట్లో పెద్ద థ్రిల్ అనమాట మాకు..
కృష్ణ: ఫస్ట్ కౌబోయ్, ఫస్ట్ జేమ్స్ బాండ్ ... మామూలుగా అప్పట్లో కలర్ ప్రింట్ రూ.60వేలు అయ్యేది. 70ఎంఎం ప్రింట్ రెండు లక్షలయ్యేది. మూడు నెలల ముందు ఆర్డరిచ్చి డబ్బులు కడితేగానీ, లాస్ ఏంజెల్స్ నుంచి ఫిల్మ్ పంపేవారు కాదు. ప్రసాద్ 70 ఎంఎం థియేటర్ కట్టారు కానీ, ఎవరూ సినిమాలు చేయలేదు. మనమే ముందు చేశాం. తమిళ్‌లోనూ రజనీకాంత్‌తో ఓ సినిమా చేశాం. అదీ 70 ఎంఎం. రాజ్ థియేటర్ దగ్గర 'సింహాసనం' చిత్రానికి రెండు కిలోమీటర్ల క్యూ ఉంటే రిలీజ్ రోజు 144 సెక్షన్ పెట్టారు. టిక్కెట్ లేని వారిని ఎవరినీ ఆ రోడ్డులో రానివ్వలేదు.
సుధీర్: ఇటీవల 'మహానటి' వచ్చింది కదా.. మీ బయోపిక్ వస్తే హీరో ఎవరో తెలుసు. ఎవరు దర్శకత్వం చేస్తే బావుంటుంది?
కృష్ణ: పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తూనే ఉంది. ఎప్పుడో తీయబోయే సినిమాకు ఇప్పుడే ఎలా చెప్పగలం.