నాగార్జున, వర్మ దర్శత్వంలో 'శివ' చిత్రం ఘనవిజయం సాధించడమే కాదు... తెలుగు సినిమా రూపురేఖలని మార్చివేసింది. ఆ తర్వాత వచ్చిన 'అంతం, గోవిందా గోవిందా' చిత్రాలు మాత్రం నిరాశపరిచాయి. అయినా 'అంతం' ఫర్వాలేదనిపించింది. ఇక వర్మ ఫామ్ కోల్పోయి చాలా కాలం అయింది. అలాంటి సమయంలో నాగార్జున ఆయనకు 'ఆఫీసర్' చిత్రం అవకాశం ఇచ్చాడు. ఇందులో నమ్మిన సిద్దాంతం కోసం నిలబడే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ శైలి, కథ, కథనాలు, తండ్రీ కూతుర్ల ఎమోషన్స్ తనకు బాగా నచ్చాయని అందుకే ఈ చిత్రం ఒప్పుకున్నానని నాగ్ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, ఇందులో ముక్కుసూటితనం, సమాజంపై గౌరవం, నిజాయితీ ఉండే శివాజీరావు అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నాను. సినిమా విషయంలో వర్మకి ఏమి షరత్తులు విధించలేదు. కానీ నాలోని టాలెంట్‌ని వాడుకోమని మాత్రం చెప్పాను. అది షరత్తు కాదు. ఇక వర్మకి చాన్స్ ఇవ్వడం విషయానికి వస్తే, నా సినీ ప్రయాణం అంతా రిస్క్‌లతోనే కొనసాగింది. ప్రతి సినిమాకు టెన్షన్ ఉంటుంది. దానిని వదిలించుకోకపోతే జుట్టు ఊడిపోతుంది. ఇక ఇటీవల తమిళస్టార్ ధనుష్ మొదటి ప్రపంచయుద్దం కాలంనాటి కథను ఒకటి చెప్పాడు. వాస్తవానికి ఆ కథను రజనీకాంత్ కోసం తయారు చేసుకున్నారట. రాజకీయాలలో రజనీ బిజీగా ఉండటంతో ఆ కథను నన్ను చేయమని ధనుష్ అడుగుతున్నాడు. కథ బాగా నచ్చింది. త్వరలోనే ఒప్పుకునేది లేనిది నిర్ణయం తీసుకుంటానని నాగ్ చెప్పుకొచ్చాడు.
ఇండస్ట్రీలో స్టార్ హీరోలకే దిక్కులేదు. ఇక వారసుల సంగతి ఏమని చెప్పాలి? ఎవరైనా సరే ఇక్కడ కష్టపడాల్సిందే అని చెప్పుకొచ్చాడు. ఇక నాగార్జున ప్రస్తుతం నానితో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇటీవల ఎక్కువగా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేసిన ఆయన.. రియల్ ఇంటెన్స్ యాక్షన్ మూవీగా చేసిన 'ఆఫీసర్' జూన్ 1 న విడుదల కానుంది. మరి ఈ చిత్రం.. నాగ్ చేసిన సాహసానికి తగ్గ ప్రతిఫలం అందిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది!