రెండు వరుస పరాజయాల తర్వాత 'భరత్ అనే నేను'తో మహేష్ ఊపు మీదున్నాడు. ఈచిత్రం ప్రమోషన్స్‌లో ఆయన కేటీఆర్‌తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ తానే మహేష్‌ని అయితే రగడ్ లుక్‌లో కనిపిస్తానని, మహేష్‌ను తాను ఎలా చూడాలనుకుంటున్నానో ఆ లుక్‌ని చెప్పడం, మహేష్ మీరు చెప్పిన లుక్‌లోనే నా తదుపరి చిత్రంలో కనిపిస్తానని మాట ఇవ్వడంతో మహేష్ సంఖ్యాపరంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంలో తమ హీరో ఎలా ఉంటాడోనని ఆయన అభిమానులందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మహేష్ ఇంత కాలం కథల పరంగా ప్రయోగాలు చేశాడే గానీ లుక్‌పరంగా పెద్దగా మార్పులు చేసింది తక్కువే. మరీ ముఖ్యంగా ఆయన హెయిర్ స్టెయిల్ ఎప్పుడు మూసగా ఉంటుంది.
ఇక తాజాగా ఈ చిత్రంలో మహేష్ డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో పాటు మీసాలతో కనిపిస్తాడని అంటున్నారు. ఇటీవల జరిగిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌ని మహేష్ తన ఫ్యామిలీతో కలిసి తిలకిస్తుండగా, ఆయన శ్రీమతి నమ్రతా మహేష్‌ని వెనుక నుంచి చూపుతూ ఓ ఫొటోని ట్వీట్ చేసింది. వెనుక నుంచి ఈ హెయిర్ గెటప్ చూస్తే మరలా పోకిరి టైప్ గెటప్‌లో ప్రిన్స్ కనిపిస్తాడా? అని అనిపిస్తోంది. ఇప్పటి వరకు హెయిర్‌స్టైల్ పరంగా మహేష్ రెండు సార్లు మాత్రమే ప్రయోగాలు చేశాడు. పోకిరి ఇండస్ట్రీ హిట్‌గా నిలిస్తే, అతిధి సరిగా ఆడలేదు. ఇక విషయానికి వస్తే మహేష్ వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు-అశ్వనీదత్‌లతో చేయనున్న చిత్రం వచ్చేనెల చివరి నుంచి ప్రారంభమవుతుంది. అమెరికా, నార్త్ ఇండియాలలో ఎక్కువ భాగం షూటింగ్ జరగనుంది. ఈ చిత్రం కోసం 'రాజసం' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇక ఇందులో మహేష్‌కి ఎత్తుపరంగా సరితూగే పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తూ ఉండటంతో ఈ జంట చూడముచ్చటగా ఉండనుందని తెలిసిపోతోంది. ఇక ఇందులో మహేష్ స్నేహితునిగా కీలకమైన పాత్రను అల్లరినరేష్ పోషించనున్నాడు.