దిల్ రాజు ఎప్పుడూ కుటుంబ కథలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అందుకే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నాడు. చిన్న హీరోలతో మీడియం రేంజ్ సినిమాలు నిర్మిస్తూ హిట్స్ కొట్టేస్తుంటాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో నితిన్ - రాశి ఖన్నా జోడిగా సతీష్ వేగేశ్న దర్శకుడిగా 'శ్రీనివాస కల్యాణం' రూపొందుతోంది. సతీష్ వేగేశ్న తన సినిమాల్లో కుటుంబాలకు విలువనివ్వడం, అందరూ ఉమ్మడి కుటుంబంగా కలిసి ఒకే చోట ఉండడం వంటి కథలతోనే సినిమాని చేస్తాడు. ఇంతకుముందు 'శతమానం భవతి' చిత్రమూ అంతే. విదేశాల్లో ఉండే పిల్లలు స్వదేశంలో ఉండే తల్లితండ్రుల దగ్గరికి వచ్చి వారి ఆలనా పాలనా చూస్తూ విదేశాల్లో చదువు అవ్వగానే.. ఆక్కడ సంపాదించుకుని స్వదేశానికి వచ్చేసి... అందరూ కలిసిమెలిసి ఉండేలా సినిమాచేసి హిట్ కొట్టాడు.
ఇక తాజాగా చేస్తున్న 'శ్రీనివాస కల్యాణం' సినిమా కూడా పూర్తి కుటుంబ నేపథ్యంలో తెరకెక్కుస్తున్న సినిమానే. డబ్బు కన్నా మనుషులు మానవ సంబంధాలు గొప్పవని చాటి చెప్పడమే ప్రధానంగా ఈ సినిమా కథ కొనసాగుతుందట. ఆర్థికపరమైన సంబంధాలకే ఎక్కువగా విలువనిచ్చే ప్రకాశ్ రాజ్.... ఒక తెలుగింటి పెళ్లికి అతిథిగా రావడం.... అక్కడ పెళ్ళిలో అందరి మధ్యలో ఉన్న అనుబంధ, ఆత్మీయతలు, మానవ సంబంధాల్లోని గొప్పతనం అర్థమవుతుందట. ఇక తరవాత ఆయనకి కనువిప్పు కలిగించడమే ధ్యేయంగా ఈ కథ నడుస్తుందనే టాక్ వినబడుతుంది.
మరి ఈసారి కూడా ఈ మానవ సంబంధాలు, కుటుంబ విలువలతోనే దిల్ రాజు, సతీష్ వేగేశ్న హిట్ కొట్టెయ్యడమే కాదు... రెండు పరాజయాలతో ఉన్న నితిన్ కూడా ఈసారి ఈ కుటుంబ కథా చిత్రంతో హిట్ అందుకోవడం ఖాయమంటున్నారు.