తెలుగు భాషని కాపాడుతూనే కొత్త పదాలను, సరికొత్త విషయాలను తెలియజేసే సరళ వైఖరి జర్నలిస్ట్‌లకు ముఖ్యం. ముఖ్యంగా ఈ బాధ్యత జర్నలిస్ట్‌లు, సినిమా రచయితలపై ఎక్కువగా ఉంటుంది. ఇక పాతకాలంలో జర్నలిస్ట్‌లు అంటే వారు వాడే భాషల్లో కొన్ని నియమ నిబంధనలు ఉండేవి. 'బడు' అనే పదాన్ని వాడే వాడు బడుద్దాయి అన్నారు కొందరు తెలుగు పండితులు. ఇక మోదీ గారు. చిరంజీవి గారు వంటి 'గారు'లు కూడా తెలుగు భాషలో నిషిద్దం. కేవలం వ్యక్తి పేరును మాత్రమే సంబోధిస్తూ, గారు, సార్ వంటి మాటలను వాడకుండా వాక్యం చివరలో అన్నారు చెప్పారు అనేలా 'రు' పదాలని, బహువచనాలను వాడాలి. అంతేగానీ తిన్నాడు. వెళ్లాడు అని వాడటం తప్పు.
ఇక ఆయన రావడం జరిగింది. ఈయన పోవడం జరిగింది అనే పదాలు కూడా ఇప్పుడు బాగా వాడుతున్నారు. కానీ ఆయన వచ్చారు.. ఆయన వెళ్లారు అని మాత్రమే వాడాలి. ఇక తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నేటి టివిలు, పెరుగుతున్న చానెల్స్‌లో వాడుతున్న తెలుగు పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. టివిలను చూసి పెరుగుతున్న నేటితరం వారు ఇదే నిజమైన తెలుగు భాషేమో అనుకునే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గతంలో 'బాహుబలి' వేడుక సందర్భంగా కీరవాణి చెప్పినట్లు 'వేటూరి, సిరివెన్నెల' తర్వాత తెలుగు సాహిత్యం అంపశయ్యపై ఉందనే ఆవేదన కూడా నిజమే. త్రివిక్రమ్ విషయానికి వస్తే ఆయన చేసింది మంచో చెడో తెలియదు గానీ రచనా పరంగా మాత్రం ఆయన వినూత్న ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాతే తెలుగులో పంచ్‌లు ఎక్కువయ్యాయని కొందరు వాదిస్తారు.
కానీ తాను ఎప్పుడు పంచ్‌ల కోసం డైలాగ్స్ రాయలేదని, డైలాగ్స్‌లోనే 'ఫన్' ఉండాలని చేస్తానని, పంచ్‌ల కంటే ఫిలాసఫీని చెప్పడానికే ఇష్టపడతానని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి త్రివిక్రమ్ ఆవేదన నిజమే. నేటి సాంకేతిక యుగంలో టివిలు, చానెల్స్, తెలుగు సినిమాలలో తెలుగుకి తెగులు పట్టిస్తున్నారనేది నిజం.