ఇటీవల వచ్చిన సావిత్రి బయోపిక్ 'మహానటి' తెలుగులోనే కాదు తమిళ నాట కూడా మంచి ఆదరణ పొందుతోంది. అశ్వనీదత్ అడగకుండానే ఈ చిత్రానికి పన్ను రాయితీ ఇస్తామని చంద్రబాబు అన్నారు. ఇక ఈ చిత్రాన్ని సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అన్ని రంగాల ప్రముఖులు అద్భుతం అని కొనియాడుతున్నారు.
ఇక ఈ చిత్రం దాదాపు ఫుల్ రన్‌లో 40కోట్లు సాధించేలా కనిపిస్తోంది. పెట్టుబడి, లాభాల పరంగా చూస్తే 'రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' వంటి స్టార్స్ చిత్రాల కంటే ఈ చిత్రమే ఎక్కువ లాభాలను తెచ్చిందని అంటున్నారు. ఇక ఈ చిత్రంపై జెమిని గణేషన్ ఆయన మొదటి భార్య అలిమేలుల కుమార్తె కమలా సెల్వరాజ్ తప్పుపట్టింది. ఇందులో తన తండ్రిని కించపరుస్తూ, ఆయనే సావిత్రికి మద్యం అలవాటు చేసినట్లు, తన తండ్రి అవకాశాలు లేక ఇంట్లో ఉన్నట్లు.. ఇలా పలు అంశాలను తప్పుగా చూపించారని మండిపడుతోంది.
తాజాగా ఈమె మాట్లాడుతూ, ఈ చిత్రంలో నా తండ్రిని చూపిన విధానంపై నొచ్చుకున్నాను. మా తల్లిదండ్రుల చరిత్రను 'కాదల్ మన్నన్'పేరుతో ఓ డాక్యుమెంటరీగా తీస్తున్నాను. ఇందులో నా తండ్రికి చెందిన గొప్పతనం ఉంటుంది... అని చెప్పుకొచ్చింది. ఇక ఈ డాక్యుమెంటరీని ఆమె త్వరలోనే విడుదల చేయనుంది. దీని నిడివి కూడా సినిమాలలాగే 100నిమిషాలు ఉంటుందని సమాచారం.