మైక్ దొరికితే చాలు ముందు వెనుక ఏమాత్రం ఆలోచించకుండా ప్రతి వారిని విమర్శించడం, ఆ తర్వాత అది మీడియా సృష్టి అనో, పొరపాటున అన్నామనో చెంపలువేసుకోవడం రాజకీయనాయకులకు అలవాటైపోయింది. మీడియాని తిడుతూ, విమర్శిస్తూ, మీడియా దారి తప్పిందని వ్యాఖ్యలు చేస్తూ మరలా వారినే పిలిచి ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో అర్ధంకాదు. అంటే తమని పొగిడితే మంచి, విమర్శిస్తే మీడియా చెడ్డది అనే పెడధోరణి పెరిగిపోతోంది.
తాజాగా ఏపీ వ్యవసాయ మంత్రి, ఎంతో సీనియర్, నెల్లూరు జిల్లా వాసి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రమణదీక్షితులు విషయంలో తీవ్ర స్థాయిలో మాట్లాడారు. రమణదీక్షితులు చేసింది తప్పా? ఒప్పా? అనే విషాయాన్ని పక్కనపెడితే యావత్ బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా సోమిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. బ్రాహ్మణులు అభివృద్ది కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని జబ్బలు చరుచుకునే టిడిపి నాయకులు నిజమైన పేద బ్రాహ్మణులకు ఈ కార్పొరేషన్ ద్వారా సాయం చేయకుండా పచ్చచొక్కా వాళ్లకి మాత్రమే లభ్ది చేకూరుస్తున్నారు.
ఇక రమణదీక్షితులను జైలులో పెడితే అసలు నిజాలు బయటికి వస్తాయని సోమిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా ఆయన క్షమాపణలు చెప్పారు. విజయసాయిరెడ్డిని ఉద్దేశించి అనాలనుకున్న వ్యాఖ్యలను రమణదీక్షితులుపై అన్నానని, దీనిని అందరు క్షమించాలని కోరారు. బ్రాహ్మణులంటే తనకెంతో గౌరవం ఉందని, వారి ఆశీర్వాదాలు అందరికీ కావాలని చెప్పారు.
ఇక విజయసాయిరెడ్డి వంటి నాయకులు ఇతర రాష్ట్రాలలో ఉండి ఉంటే జైలుకు పంపేవారని వ్యాఖ్యానించాడు. మరి ఏపీలో అధికారంలో ఉంది టిడిపి పార్టీనే. అందులోనూ సోమిరెడ్డి ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి వీరు విజయసాయిరెడ్డిని నిజంగా తప్పుంటే జైలుకి పంపకుండా ఇంకా మీన మేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు? అనే విషయంపై సోమిరెడ్డి వద్ద సమాధానం ఉందా? అనేది తెలియాలి.