ఉద్దానం బాధితుల కోసం దీక్ష చేసిన పవన్ తాజాగా మాట్లాడుతూ, పరిశ్రమ కోసమని విదేశాలకు కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతూ వెళ్లి వస్తున్నారు. మరి ఉద్దానం బాధితులను ఆదుకోవడానికి వారి వద్ద నిధులు లేవా? 20వేల మంది బాధితులు ఉంటే ఎంత మందికి పెన్షన్లు ఇస్తున్నారు? వెంటనే ఉద్దానం బాధితుల కోసం నిధులు, పెన్షన్లు, వారి ట్రీట్‌మెంట్‌కి అవసరమైన నిధులు కేటాయించాలి. ప్రతి మండలంలో ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి, బాబుది నవ్వుతూ కౌగిలించుకుని వెన్నుపోటు పొడిచే మనస్తత్వం. నేను గుర్తింపు కోసం ఇవ్వన్నీ చేస్తున్నానని చంద్రబాబు అంటున్నాడు. రాజకీయంగా గుర్తింపు కావాలనుకుంటే కిందటి ఎన్నికల్లో మీకెందుకు మద్దతు ఇచ్చి ఉండేవాడిని? రెండువేల కోట్లను పుష్కరాలకు కేటాయించిన ప్రభుత్వానికి పేదల సమస్యలు తీర్చడానికి సమయం, డబ్బు లేవా? అని ప్రశ్నించాడు.
ఇక ఈయన తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలసలో మాట్లాడుతూ, శ్రీకాకుళం వెనుకబడిన ప్రాంతం కాదు. వెనకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. ఇక్కడ అన్ని ఇసుక కబ్జాలు, భూకబ్జాలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు అవసరమైతే జగన్‌నైనా కౌగిలించుకుని ఆలింగనం చేసుకుంటాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, కాంగ్రెస్, వైసీపీలు కలిసి పోటీ చేసి, ఒకరినొకరు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు చూసి చంద్రబాబు కేంద్రానికి భయపడుతున్నాడు. ఇలాగే ఇసుక దోపిడీ జరిగితే భవిష్యత్తులో ఇసుకను మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏపీలో ఎక్కడ భూమి కనిపించినా టిడిపి నాయకులు కబ్జాలు చేస్తున్నారు. మట్టిని అమ్ముకునే వారు మట్టిలోనే కలిసి పోతారు. ఏపీని టిడిపి నాయకులు 'కబ్జా ఆంద్రప్రదేశ్'గా మార్చారు.
వంశధార ప్రాజెక్ట్‌ని పూర్తి చేయకుండానే అక్కడి ప్రజలను మెడపెట్టి గెంటేశారు. వంశధార నిర్వాసితులను మోసం చేయవద్దు. అగ్రిగోల్డ్ బాధితులకు కూడా వెంటనే న్యాయం చేయాలి. మనకి కావల్సింది పార్టీ జెండాలు కాదు జాతీయ జెండా కావాలని చెప్పారు. తమ పార్టీకి మద్దతు వస్తే ఉద్యోగుల సీపీసీ స్కీంని పూర్తిగా రద్దు చేస్తామని, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాలో జనసేన కార్యకర్తల మీద కక్ష్యసాధింపు చర్యలను ఆపాలని పవన్ డిమాండ్ చేశాడు.