సావిత్రి, ఏయన్నార్ వంటి వారి చరిత్ర గురించి ఎక్కువగా విషయాలు, విశేషాలు సేకరించి, వారిపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి సంజయ్‌కిషోర్. ఈయన తాజాగా మాట్లాడుతూ, సావిత్రి గురించి ఎవరు ఏ ప్రయత్నం చేయాలనుకున్నా, అందుకు సంబంధించిన సమాచారం విషయంలో నా పేరు ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. ఇక 'మహానటి' చిత్రం తీసేముందు దర్శకుడు నాగ్ అశ్విన్ ఇతరులు నా వద్దకు వచ్చారు. వారికి నా వద్ద సావిత్రి గారికి సంబంధించి ఉన్న మెటీరియల్ అంతా చూపించాను. వారు ఎంతో సంతోషించారు. వారు ఎన్ని చేసినా అలాంటి సమాచారం వారికి దొరకదు. నేను కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వాటిని సంపాదించాను. ఇక ఈ చిత్రం తీయడంలో నేనందించిన సమాచారం వాడుకుని కనీసం థ్యాంక్స్ కార్డు కూడా వేయక పోవడం బాధకలిగించింది. ఆర్ధికంగా నేనేమీ ఆశించలేదు. కనీసం థ్యాంక్స్ చెప్పి ఉండాలని భావించాను. అయినా వారికి విషెస్ తెలుపుతున్నాను.
ఇక సావిత్రి గారు సినిమాలలోకి రాకముందు ఏయన్నార్ అభిమాని, ఏయన్నార్ నటించిన 'సంసారం' చిత్రంలో ఆమెకి ఆయనకి జోడీగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఏయన్నార్‌తో చేయడం అంటే భయపడింది. దాంతో అందులో చిన్న పాత్ర మాత్రమే వేసింది. ఆ తర్వాత ఆమె ఏయన్నార్‌తో కలిసి 'దేవదాసు'లో అద్భుతంగా నటించింది. పదేళ్ల తర్వాత 'సుమంగళి'లో యాక్ట్ చేసింది. ఈ చిత్రం షూటింగ్‌లో ఆమె ఏయన్నార్ గారితో గురువు గారు ఆ సీన్ అలా చేస్తే బాగుంటుంది కదా..! ఇలా చేస్తే బాగుంటుంది కదా..! అని ఏయన్నార్ గారికే సూచనలిచ్చే స్థాయికి ఎదిగింది. ఇది ఏయన్నార్ నాకు స్వయంగా చెప్పారు.
ఇక సావిత్రి గారి చివరి రోజుల్లో ఆమె బెంగుళూరులో ఓ చిత్రంలో చిన్న పాత్ర చేస్తోంది. అందులో లక్ష్మీ ప్రధాన పాత్రను పోషించింది. ఆమె షూటింగ్‌కి వచ్చిన వెంటనే సావిత్రిగారి గురించి అడిగింది. ఆమె అపస్మారక స్థితిలో ఉండటంతో ఆసుపత్రిలో చేర్చామని చెప్పారు. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి ప్రతి వార్డులో వెతికారు. చివరకు వరండాలో నేల మీద పడుకోబెట్టిన సావిత్రి గారిని చూసి తట్టుకోలేక హాస్పిటల్‌లో నానా గొడవ చేసి స్పెషల్ వార్డ్‌లో చేర్పించారు అని చెప్పుకొచ్చాడు సంజయ్‌కిషోర్. కానీ ఈ సీన్‌ని సినిమాలో పేలవంగా చూపించారని ఆయన అభిప్రాయపడ్డారు.