1980లలో ప్రేమకధా చిత్రాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాల హవా నడుస్తున్న రోజుల్లో ఎర్రసూరీడుగా పేరున్న రెబెల్‌స్టార్ మాదాల రంగారావు తనదైన విప్లవాత్మక చిత్రాలు, ఎర్ర చిత్రాల ద్వారా తెలుగు సినిమా దశ, దిశను సరికొత్త మలుపు తిప్పారు. కేవలం విప్లవాత్మక చిత్రాలంటే అవార్డు చిత్రాలు, ప్యార్‌లర్ చిత్రాలనే భావనను ఆయన తుడిచిపెట్టి ఆ చిత్రాల ద్వారా కూడా కమర్షియల్‌గా సక్సెస్ కావడం ఎలాగో నేర్పించారు. ఇక ఆ తర్వాత తరంలో అభ్యుదయ భావాల చిత్రాల దర్శకునిగా పేరొందిన హీరో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ, నిర్మాత పోకూరి బాబూరావు వంటి వారిని ఆయన వెలుగులోకి తెచ్చారు.
మాదాల రంగారావుకి నాడు రెడ్‌స్టార్ అనే బిరుదు ఉండేది. ఈయనది ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పక్కనే ఉన్న మైనంపాడు గ్రామం. ఆయన ఒకానొక దశలో వామపక్ష భావజాలంతో నిండి అవినీతి, వ్యవస్థలోని లోపాలపై చిత్రాలు తీస్తూ, తాను నక్సలిజంను సమర్ధించడంలేదని, కానీ సమాజంలోని అస్తవ్యస్త పరిస్థితులను తాను ఖండిస్తూ సినిమాలు తీస్తున్నానని చెప్పారు. ఇక ఈయన యువకుడిగా ఉన్నప్పుడే వామపక్ష పార్టీలు, ప్రజానాట్యమండలి వంటి వాటిల్లో ఆసక్తిగా ఉత్సాహంగా పాలుపంచుకునే వాడు. తన మొదటి చిత్రంగా పొలిటికల్ సెటైర్ చిత్రం 'చైర్మన్ చలమయ్య' చిత్రం తీసి, ఆ తర్వాత తానే సొంతగా నవతరం ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ బేనర్‌లో ఈయన 'యువతరం కదిలింది. ఎర్రమల్లెలు, విప్లవశంఖం, స్వరాజ్యం, ఎర్రసూర్యుడు. ఎర్రపావురాళ్లు, జనంమనం, ప్రజాశక్తి, మహాప్రస్థానం, వీరభద్రుడు, మరో కురుక్షేత్రం' వంటి ఆణిముత్యాలను తీశారు.
ఇక ఈయన కుమారుడు మాదాలరవి కూడా రష్యాలో వైద్యవిద్యను అభ్యసించి, తర్వాత హీరోగా మారి కొన్ని చిత్రాలు తీసినా ఆయన హీరోగా క్లిక్ కాలేదు. ఇక ఈయన తర్వాత ఎర్రచిత్రాల బాధ్యతను ఆర్.నారాయణమూర్తి తీసుకున్నాడు. ఇక గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా మాదాల రంగారావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు (ఆదివారం) ఉదయం మాదాల రంగారావు తన తుది శ్వాస విడిచారు. ఇక ఈయన నటించి, నిర్మించిన 'యువతరం కదిలింది' చిత్రం నాడు సంచలనం సృష్టించి, నంది అవార్డులను కూడా గెలుపొందడం విశేషం. తెలుగు సినిమా ఉన్నంతకాలం మాదాల రంగారావు చిత్రాలు నిత్యం ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీజోష్ కోరుకుంటుంది.