ఓ చిత్రం సరిగా ఆడలేదంటే దానిని ఫ్రాంక్‌గా ఒప్పుకోవడానికి కూడా గట్స్ ఉండాలి. ఈ విషయంలో నిన్నటిదాకా నాగార్జున తన చిత్రాల విషయంలో దాపరికం లేకుండా సినిమా ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని ఒప్పుకునే వాడు. కాగా ప్రస్తుతం ఆ బాధ్యతను నేచురల్ స్టార్ నాని తీసుకున్నాడు. బహుశా నాగార్జునతో మల్టీస్టారర్ చేస్తోన్న నాని మైండ్‌సెట్ నాగార్జున వల్లనే మారిందేమో అంటున్నారు. ఇక విషయానికి వస్తే 'ఎవడే సుబ్రహ్మణ్యం'తో మొదలుపెట్టి వరుసగా 8 హిట్స్‌ని నాని ఇచ్చాడు. యావరేజ్ కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా తన స్టామినాతో నిలబెట్టాడు. ఇలా తన 9వ చిత్రంగా వచ్చిన 'కృష్ణార్జునయుద్దం'తో ఆయన ట్రిపుల్ హ్యాట్రిక్ అందుకోవడం ఖాయమని అందరు డిసైడ్ అయ్యారు. కానీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని పండించే యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని డబుల్ యాక్షన్ చేసిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. ఫ్లాప్ ముద్రను వేసుకుంది.
నిజానికి రోటీన్ కథలు ఒప్పుకుంటూ అదే కోవలో హిట్స్ కొడుతున్న నానికి ఇది మంచి పనే చేసింది. ఆయన కథల ఎంపికలో వైవిధ్యం ఉండేలా చూసుకునే విధంగా షాక్‌నిచ్చింది. ఇక ఈ చిత్రం డిజిటల్ ఫార్మెట్‌లో తాజాగా యుప్ టీవీలో అందుబాటులోకి వచ్చింది. దీని గురించి ఆ డిజిటల్ సంస్థ నాని లేటెస్ట్ సూపర్‌హిట్ ఫ్లిక్ 'కృష్ణార్జునయుద్దం' యుప్ టివి మినీథియేటర్‌లో చూడండి.. అని ప్రకటన ఇచ్చింది. దానిపై నాని స్పందిస్తూ 'సూపర్‌హిట్ అంట.. అవ్వలేదు బాబోయ్...ఆడలేదు కూడా...అయినా మనసు పెట్టి చేశాం. చూసేయండి' అంటూ అసలు టాక్‌ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.
ఇందులో నాని నిజాయితీని పలువురు మెచ్చుకుంటున్నారు. సినిమా ఆడలేదన్న విషయాన్ని నాని పబ్లిక్‌గా ఒప్పుకున్నాడు. ఆయన ఫ్రాంక్‌నెస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. కాలం మారింది. హీరోలు మారుతున్నారు.. అనే దానికి దీనిని ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. మున్ముందు ఇలాంటి ప్రచారం చేసే సమయంలో సదరు డిజిటల్ చానెల్స్ కాస్త జాగ్రత్తలు తీసుకోకపోతే వారి గుడ్ విల్ దెబ్బతినడం ఖాయమని చెప్పవచ్చు.