వయసులో ఉన్నప్పుడు ఏ చిత్రంలో అవకాశం వస్తే చాలు వాటిని ఓకే చేస్తారు. గ్లామర్‌డోస్‌కి డోర్లు తీస్తారు. స్టార్ హీరోల చిత్రాలలో నటించడానికి ఒప్పుకుంటారు. తమ పాత్ర, దాని పరిధి గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఇక బిజీగా ఉండే హీరోయిన్లు తాము ఫామ్‌లో ఉన్నప్పుడు మాత్రం మౌనంగా ఉండి వయసు మీదపడి ఫేడవుట్ అయ్యే దశలో మాత్రం సినిమా ఫీల్డ్‌లో పురుషాధిక్యం ఉందని, సినిమాలన్నీ హీరోల చుట్టూనే తిరుగుతాయని, తమను కేవలం ఆడిపాడే బొమ్మగా మాత్రమే చేస్తారని మాట్లాడుతారు.
తాజాగా శ్రియా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. 'ఇష్టం' చిత్రంతో ఈమె తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యేనాటిని నేటి టీనేజర్లకి ఆమె కనీసం తెలియను కూడా తెలియకపోవచ్చు. 15ఏళ్లకు పైగా కెరీర్‌లో ఈమె రజనీకాంత్ నుంచి పవన్‌కళ్యాణ్ వరకు అందరితో కలిసి నటించింది. ఆ తర్వాత వయసు మీద పడటంతో ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా సరిగా ఆడలేదు. దాంతో తన రష్యన్ బోయ్‌ఫ్రెండ్‌ని వివాహం చేసుకుని రష్యాలో సెటిల్ అవుతుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె ఇండియా వచ్చింది.
చెన్నైలో ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తెలుగులో ఓ చిత్రం ఒప్పుకున్నాను. త్వరలో ఆ చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నాను. ఇప్పటికీ చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ పాత్రలు, కథలు నచ్చక ఒప్పుకోవడం లేదు. ఇండస్ట్రీలో పురుషాధిక్యం ఎక్కువ. కథానాయికల పరిధి చాలా తక్కువగా ఉంటోంది. తమ పాత్రల నిడివి షూటింగ్ పూర్తయ్యే సరికి మరింత తక్కువైపోతోంది. ఇక నాకు తమిళం కంటే తెలుగులోనే ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తున్నాయని తెలిపింది. మరి శ్రియా నటించేది బాలకృష్ణ సరసనా లేక వెంకటేష్ సరసనా అనేది తెలియాల్సి వుంది...!