గతంలో ఎన్టీఆర్ - సురేందర్ రెడ్డి కలయికలో తెరకెక్కిన ఊసరవెల్లి సినిమా హిట్ అయినప్పటికీ... ఆ సినిమాకి నిర్మాతలు సరైన పబ్లిసిటీ కల్పించకపోవడం వలన.. కలెక్షన్స్ రాలేదు. ఊసరవెల్లి సినిమా కంటెంట్ పరంగా బావుంటుంది. కానీ కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ సినిమాల్లో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అదే ఊసరవెల్లి సినిమా లాగే.. కొన్ని సినిమాలు ఎపుడు తెరకెక్కుతాయో.. ఎప్పుడు థియేటర్స్ లో కొస్తాయో కూడా తెలియదు. చాలా చిన్న సినిమాల పరిస్థితి అంతే. అయితే ఇప్పుడొక సినిమా ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుందో.. ఎప్పుడు విడుదలకు డేట్ ఇచ్చిందో కానీ.. ఆ సినిమా విడుదలైన విషయం కనీసం ప్రేక్షకుడికి పెద్దగా తెలియని పరిస్థితి. అయినా సినిమా హిట్ అనుకోండి. కానీ సినిమాకి కలెక్షన్స్ వస్తాయంటే మాత్రం డౌట్.
ఇంతకీ ఆ సినిమా ఏదంటే. నాగ శౌర్య - షామిలి జంటగా తెరకెక్కిన 'అమ్మమ్మగారిల్లు'. 'ఛలో' సినిమాతో సూపర్ ఫామ్ లో కొచ్చిన నాగ శౌర్య ఇలా చడీ చప్పుడు లేకుండా ఒక సినిమా చేయడం.. అది థియేటర్స్ లోకి దిగిపోవడం జరిగిపోయాయి. రెండు నెలల క్రితం ఉగాది శుభాకాంక్షలతో 'అమ్మమ్మగారిల్లు' పోస్టర్ చూసే వరకు ఆ సినిమా ఒకటుందని.. అందులో నాగశౌర్య ఉన్నాడని కూడా తెలియదు. ఇక గత వారం 'అమ్మమ్మగారిల్లు' సినిమాని శుక్రవారం మే 25 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ సినిమాకి సంబందించిన ఒక్క ప్రమోషన్ లేదు. కనీసం నాగశౌర్య ఇంటర్వ్యూ గాని, షామిలి ఇంటర్వ్యూ గాని లేదు. ఏదో అమ్మమ్మగారిల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని హడావిడి చెయ్యడం తప్ప.
ఇక రవితేజ నేల టికెట్ కి పోటీగా నాగశౌర్య అమ్మగారిల్లు థియేటర్స్ లోకి ఎటువంటి హడావిడి లేకుండా వచ్చేసింది. అయితే నేల టికెట్ కి ప్లాప్ టాక్ రాగా.... 'అమ్మమ్మగారిల్లు'కి పాజిటివ్ టాక్ వచ్చింది. కుటుంబ విలువలకు విలువనిస్తూ దర్శకుడు ఈ సినిమాని హ్యాండిల్ చేసిన విధానం దగ్గర నుండి నాగశౌర్య పెరఫార్మెన్స్, రావు రమేష్ నటన, సెకండ్ హాఫ్ అలాగే డైలాగ్స్ కూడా అమ్మగారిల్లు సినిమాని హిట్ చేశాయి. అయితే ఈ సినిమాకి సరైన పబ్లిసిటీ గనక నిర్మాతలు చేసుంటే.. నాగశౌర్య ఖాతాలో మరో సూపర్ హిట్ పడేది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో కొచ్చినట్టుగా సిటీ ఆడియన్స్ కి తప్ప మాస్ ఆడియన్స్ కి తెలిసే అవకాశం లేదు. పబ్లిసిటీ అంత వీక్ గా వుంది. మరి మేకర్స్ ఈ సినిమా గురించి ఎందుకంత లైట్ తీసుకున్నారు అనేది ఆ దేవుడికే తెలియాలి.