సాధారణంగా స్పీడ్‌గా సినిమాలు తీస్తాడనే పేరున్న పూరీజగన్నాథ్ తన రొటీన్ మాఫియా చిత్రాలను పక్కనపెట్టి ఇండో పాక్ వార్ నేపధ్యంలో ఓ పీరియాడికల్ ప్రేమకథగా, పునర్జన్మల నేపధ్యంలో తన కుమారుడు ఆకాష్‌పూరికీ రీలాంచ్ మూవీగా తీయాలనే కసితో 'మెహబూబా' చిత్రం తీశాడు. ఈ చిత్రం కోసం తన ఆస్తులను కూడా కుదువపెట్టానని ఆయన చెప్పాడు. తనకు జీరో నుంచి మరలా ఎదగడం, డబ్బు పోగొట్టుకోవడం, సంపాదించడం బాగానే తెలుసునని చెప్పాడు. కానీ ఈ చిత్రం కూడా బాగా ఆడలేదు. అయినా కామ్‌గా ఉండేది లేదని తన కుమారుడు ఆకాష్‌పూరీతో మరో రెండు మూడు చిత్రాలు చేస్తానని చెప్పాడు.
ఇక 13 ఏళ్ల తర్వాత ఆయన 'శివమణి, సూపర్' చిత్రాల తర్వాత నాగార్జునని కలిసి తాను చిరంజీవి 150వ చిత్రం కోసం రాసుకున్న 'ఆటోజానీ' చిత్రాన్ని లైన్‌లో పెట్టాడని వార్తలు వచ్చాయి. ఇక పూరీ 'పైసావసూల్' చిత్రాన్ని బాలయ్యతో చేశాడు. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. అయినా బాలయ్య చిత్రం చేస్తానంటే తానెప్పుడు రెడీ అని పూరీ చెప్పాడు. బాలయ్య కూడా పూరీతో మరో చిత్రం చేస్తానన్నాడు. తాజాగా పూరీ బాలయ్యని కలిసి ఓ కథ చెప్పాడట. కథ బాగానే ఉన్నప్పటికీ బాలయ్యతో సినిమా అంటే చాలా కాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.
ప్రస్తుతం బాలయ్య.. వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత ఆయన ఎన్టీఆర్ బయోపిక్‌ని పూర్తి చేయాల్సివుంది. ఆ తర్వాత కూడా బోయపాటి శ్రీనుతో బాలయ్య కమిట్ అయ్యాడు. మరి అప్పటిదాకా పూరీ వెయిట్ చేస్తాడా? లేదా మరో హీరోతో గానీ లేదా తన కుమారుడితో మధ్యలో ఓ చిత్రం పూర్తి చేస్తాడా? అనేది వేచిచూడాల్సి వుంది!