తెలుగు రాష్ట్రాలలోని రజనీకాంత్ అభిమానులకు ఇది స్వీట్ న్యూస్ కిందే చెప్పాలి. రజనీ నటించిన '2.ఓ' చిత్రం ఆలస్యం అవుతూ ఉండటంతో తమిళ ప్రేక్షకులే కాదు.. తెలుగుతో సహా దేశవ్యాప్తంగా అభిమానులు సినీ ప్రేమికులు కాస్త నిరుత్సాహంలో ఉన్నారు. ఆ లోటుని కాస్తైనా తీరుస్తుందని రజనీ అభిమానులు 'కాలా'పై నమ్మకాలు పెట్టుకుని ఉన్నారు. 'కబాలి' తర్వాత అదే దర్శకుడు రంజిత్ పా దర్శకత్వంలో ధనుష్ నిర్మాతగా వండర్‌బార్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో వేడుకను ఇటీవల చెన్నైలో ఘనంగా నిర్వహించారు.
కానీ సంతోష్ నారాయణ్ అందించిన పాటలు వింటుంటే మాత్రం తమిళ వాసనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక 'కబాలి' చిత్రం తమిళ ప్రేక్షకులను బాగానే అలరించింది గానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. కానీ 'కాలా' చిత్రం మాత్రం మరో 'భాషా'లా ఉంటుందనే ఆశతో అభిమానులు ఉన్నారు. ఇక ఈ చిత్రం తెలుగు ఆడియో వేడుక ఈనెల 29వ తేదీన సాయంత్రం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో సినీ ప్రముఖులు ఆధ్వర్యంలో జరగనుంది. తెలుగులో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీగా విడుదల చేయనున్న ఈ చిత్రం వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
ఇక ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి రజనీకి జోడీగా నటిస్తుండగా, ది గ్రేట్ నానా పాటేకర్ ఇందులో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. మరి ఈ చిత్రమైన తెలుగులో మరో 'భాషా' అనిపిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది. ఈ చిత్రాన్ని జూన్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.