ప్రణీత సుభాష్.. ఈమె 'బావ, రభస, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం' వంటి చిత్రాలలో నటించింది. వాస్తవానికి ఈమె కన్నడ కస్తూరి. కానీ తెలుగులో సంప్రదాయబద్దమైన పాత్రలు చేయడం, ముఖ్యంగా 'అత్తారింటికిదారేది'తో ఆమెకు బాపు బొమ్మగా పేరు రావడంతో అందరు తెలుగమ్మాయేనని భావిస్తుంటారు. ఇక ఈమె చేసే పాత్రలు కూడా తెలుగుదనంతో నిండి, కళ్లతో హావభావాలు చూపే టాలెంట్ ఉండటంతో అందరు ఆమెను తెలుగమ్మాయిగా భావిస్తూ వచ్చారు అయినా 'బ్రహ్మోత్సవం' చిత్రంలో ఈమె నటించింది. ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత ఆమె మరలా తెలుగులో కనిపించలేదు. అయినా హీరో ఎవరనేది చూడకుండా, ఎంత మంది హీరోయిన్లు ఉన్నా కూడా పాత్రలను ఒప్పుకుంటూ వస్తోంది.
ఈమెకి ఇంత కాలానికి తెలుగులో మరో అవకాశం లభించింది. దిల్‌రాజు నిర్మాతగా హీరో రామ్-త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న 'హలో గురూ ప్రేమకోసేమే' చిత్రంలో సెకండ్ హీరోయిన్ చాన్స్ వచ్చింది. ఈ చిత్రం తనకు ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకంతో ప్రణీత ఉంది. ఇందులో తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, గ్లామర్ తరహా పాత్రలో కనిపిస్తానని, పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ, గ్లామరస్ గా కనిపించే పాత్ర కూడా ఇది అని ఆమె నమ్మకంతో చెబుతోంది. తాను ఇంత కాలం పోషించిన పాత్రల వల్ల తనకు ఎక్కువగా శారీలు, జ్యువెలరీ యాడ్స్ మాత్రమే వచ్చేవని కానీ ఈ చిత్రంతో తన కెరీర్ కొత్త పుంతలు తొక్కుతుందని నమ్మకం వ్యక్తం చేస్తోంది.
ఇంతకాలం ప్రేక్షకులు తనను ఎక్కడ చూసినా తెలుగులోనే మాట్లాడేవారని, తాను తెలుగమ్మాయినని వారి నమ్మకమని, కానీ ఈ చిత్రంతో తాను మరలా టాలీవుడ్‌లో బిజీ కావడం ఖాయమని నమ్మకంతో చెబుతోంది. మరి ఈమె ఆశలు ఎంత వరకు నిజమవుతాయో వేచిచూడాల్సివుంది...!