ప్రస్తుతం యువదర్శకులు, వినూత్న, వైవిధ్యభరితమైన దర్శకుల హవా సాగుతోంది. చాలా మంది ఇంతకాలం వచ్చిన చిత్రాలకు భిన్నంగా కమర్షియల్ అంశాలను పక్కనపెట్టి అన్ని రసాలను రంగరించి సరికొత్త వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు వస్తున్నారు. సినిమా హిట్ కాకపోయినా ఇలాంటి దర్శకులు ప్రేక్షకులను, నిర్మాతలను మెప్పించగలిగితే వరుస అవకాశాలు గ్యారంటీనే అని చెప్పాలి. రొటీన్ స్టోరీ తీసి ఫ్లాప్ కొట్టడం కన్నా వైవిధ్యభరితమైన చిత్రం తీసి యావరేజ్‌గా నిలిచినా చాలని భావిస్తున్నారు. మరికొందరు ఫార్ములాని మిస్ కాకుండా కమర్షియల్ యాంగిల్ ఉండేలా చూసుకుంటూనే లవ్, యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అన్నింటిని వడపోస్తున్నారు.
ఇక నాగశౌర్య కెరీర్‌కి ఇటీవల వచ్చిన 'ఛలో' చిత్రం ఎంతటి బూస్ట్‌ని అందించిందో అందరికి తెలుసు. ఈ చిత్రాన్ని స్వయంగా నాగశౌర్యనే నిర్మించడం విశేషం. ఈ చిత్రం ద్వారా వెంకీ కుడుముల తన సత్తాచాటాడు. చిత్రాన్ని సరికొత్తగా ఆవిష్కరించిన ఆయనకు పలువురు నిర్మాతల నుంచి ఆఫర్స్ లభిస్తున్నాయి. అలాంటివి వెంకీకి తాజాగా గీతాఆర్ట్స్ నుంచి పిలుపు వచ్చిందట. ప్రస్తుతం హీరో, నిర్మాతలతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో అల్లు అరవింద్ ఈ స్క్రిప్ట్‌ని లాక్ చేయించడం ఖాయమని తెలుస్తోంది. కాగా తేజూ ప్రస్తుతం వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొంటూ ఉండటంతో ఆయన కరుణాకరన్‌తో చేస్తోన్న 'తేజ్ ఐ లవ్‌యు' తర్వాత ఈ చిత్రానికే గ్రీన్‌సిగ్నల్ ఇస్తాడని, తేజుకి హిట్‌ఇచ్చే బాధ్యతను గీతాఆర్ట్సే తీసుకోనుందని సమాచారం.
ఇక తేజు కూడా దర్శకుల విషయంలోనే కాదు ఇక నిర్మాతల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. అందుకే కె.యస్.రామారావు, గీతాఆర్ట్స్, దిల్‌రాజు వంటి వారివైపే చూస్తున్నాడు. మరోవైపు తేజుతో చిత్రం చేయడానికి కిషోర్ తిరుమల, చంద్రశేఖర్ యేలేటి, గోపీచంద్ మలినేని వంటి దర్శకులు కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. మరి తేజు తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందో వేచిచూడాల్సివుంది...!