ఒకవైపు 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్‌తో రామ్‌చరణ్ ఊపు మీదున్నాడు. డివివి దానయ్య, కైరా అద్వానీలు 'భరత్ అనే నేను' ఇచ్చిన జోష్‌లో ఉన్నాడు. ఇక మాస్ చిత్రాలకు, యాక్షన్‌కి ఎమోషన్స్‌ని దట్టించే చిత్రాలను బోయపాటి శ్రీను ఎలా తెరకెక్కిస్తాడో అందరికీ తెలిసిందే. వీరందరి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ఇటీవల బ్యాంకాక్‌లో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇక్కడ రామ్‌చరణ్, కైరా అద్వానీలపై ఓ పాటను, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తయింది. 'షెడ్యూల్ పూర్తయింది. చిన్న పార్టీ చేసుకుంటున్నాం. ఇంత హార్డ్‌వర్క్ తర్వాత స్మాల్ పార్టీని చేసుకోవడానికి మేము అర్హులమే' అని కైరా అద్వానీ తెలిపింది.
ఇక ఈ యూనిట్ హైదరాబాద్ రానుంది. ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో రామ్‌చరణ్ కాస్త గ్యాప్ తీసుకోనున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ ఎలాగూ హైదరాబాద్‌లోనే ఉన్నాడు. దీంతో ఈ విరామ సమయంలో రాజమౌళి రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లకు తాను తెరకెక్కించబోయే పూర్తి స్క్రిప్ట్‌ను వినపించనున్నాడని తెలుస్తోంది. మరోవైపు బాలయ్యతో బోయపాటి శ్రీను 'సింహా, లెజెండ్' తర్వాత మరో చిత్రం చేయనున్నాడు. మొదటి ఈ చిత్రాన్ని బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించి, తర్వాత రామ్‌చరణ్ చిత్రం పూర్తయ్యే వరకు బోయపాటి దానిని హోల్డ్‌లో పెట్టనున్నాడు. ఆ తర్వాత బాలయ్య వినాయక్ చిత్రంతో బిజీ అవుతాడు. ఇలా రామ్‌చరణ్, బోయపాటిలు తమకు లభించిన గ్యాప్‌ని బాగానే సద్వినియోగం చేసుకోనున్నారని చెప్పవచ్చు.
ఇక బోయపాటి రామ్‌చరణ్ దానయ్యల చిత్రంలో కైరా అద్వానీతో పాటు తమన్నా స్పెషల్‌సాంగ్ చేయనుండగా, స్నేహ, ప్రశాంత్, జగపతిబాబు, శ్రీకాంత్, వివేక్ ఒబేరాయ్ వంటి వారు కీలకపాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది దసరా లేదా దీపావళి రేసులో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.