ఏక్షణాన దక్షిణాదిని వీడి బాలీవుడ్‌కి వెళ్లిందో గానీ తాప్సి పన్ను దశ తిరిగిందనే చెప్పాలి. ఆమెకు బాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలే కాదు.. మంచి పెర్‌ఫార్మెన్స్‌ని ప్రదర్శించే పాత్రలు కూడా వెత్తుకుంటూ వస్తున్నాయి. ఇక 'జుడ్వా 2'లో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక తెలుగులో ఈమె నటించిన చివరి చిత్రం 'ఆనందోబ్రహ్మ' మంచి హిట్ కావడమే కాదు... 'ఘాజీ'లో చిన్న పాత్రే అయినా గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక తాజాగా ఈమె ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రంలో 'గురు' ఫేమ్ రితికా సింగ్‌తో కలిసి నటిస్తోంది. గతంలో ఆదిపినిశెట్టి, తాప్సిలు కలిసి 'గుండెల్లో గోదారి' చిత్రంలో కలిసి నటించారు.
ఇక తాజాగా ఆమె నటించిన రెండు బాలీవుడ్ చిత్రాలు కేవలం 14రోజుల గ్యాప్‌లో బాలీవుడ్‌లో హల్‌చల్ చేయనున్నాయి. ఈ రెండు చిత్రాలలో తాప్సి పోషించిన పాత్రలు మంచి పర్‌ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలే కావడం విశేషం. హాకీ ప్లేయర్ సందీప్‌సింగ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ 'సూర్మా' చిత్రం జులై 13న విడుదల కానుంది. ఇందులో టైటిల్ రోల్‌ని దిల్జీత్‌సింగ్ పోషించగా, ఫీమేల్ లీడ్ హర్మన్‌ప్రీత్‌కౌరన పాత్రలో తాప్సి నటించింది. ఇక తాప్సి లాయర్ ఆర్తీగా నటించిన 'ముల్క్' చిత్రం రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించారు. ఈ చిత్రం జులై 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి అభినవ్ సిన్హా దర్శకత్వం వహిస్తుండగా, రిషీకపూర్, ప్రతీక్‌బబ్బర్, రజత్ కపూర్, అశుతోష్‌రాణా, నీనా గుప్తా తదితరులు నటిస్తున్నారు.
ఇక 'సుర్మా' చిత్రానికి షాద్ అలీ దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి 'సూర్మా' బయోపిక్‌గా రూపొందుతుండగా, 'ముల్క్' చిత్రం మధ్యతరగతి పరువు మర్యాదల నేపధ్యంలో రూపొందుతోంది. ఇవి కాక తాప్సి మరో రెండు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది. 'తడ్కా, మన్‌మర్జియాన్' చిత్రాలు కూడా విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇలా ఆమె నటించిన ఐదు చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్దం అవుతున్నాయి.