తెలుగులో 'సొంతం', ఆతర్వాత విక్టరీ వెంకటేష్ 'జెమిని' చిత్రాలలో నటించింది నమిత. ఆ తర్వాత ఆమె కోలీవుడ్‌కి వెళ్లి విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆమె భారీ అందాలు తమిళ తంబీలకు బాగా నచ్చాయి. ఇక ఈమె పెళ్లి కాకముందు నటించిన 'పొట్టు' అనే చిత్రం ఈనెల 25న తమిళంలో విడుదల కానుంది. ఇక కిందటి ఏడాది నవంబర్‌లో ఆమె తన సహనటుడు వీరేంద్రచౌదరిని తిరుపతిలో వివాహం చేసుకుంది. అయితే ఆమె పెళ్లయితే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని లేదు. చాలెంజింగ్ పాత్రలు వస్తే చేస్తానని ఘంటా పధంగా చెప్పింది. ఆమె అనుకున్నట్లే 11 ఏళ్ల తర్వాత తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, స్టార్ శింబు తండ్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన టి.రాజేందర్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. ఇందులో రాజేందరే కీలక పాత్రను పోషిస్తుండగా, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న చిత్రంలో మరో కీలక మైన పాత్రను నమిత పోషిస్తోంది.
తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ దక్షిణాదిలోకి తెలుగు చిత్రాల ద్వారానే ఎంట్రీ ఇచ్చానని, తెలుగులో నటించడమంటే తనకెప్పుడు ఇష్టమేనని చెప్పింది. అయితే రొటీన్ పాత్రలను కాకుండా చాలెంజింగ్‌గా అనిపించే పాత్రలు తెలుగులో వస్తే ఖచ్చితంగా వాటిని కూడా చేస్తానని, మరీ ముఖ్యంగా తాను నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రలను ఆశిస్తున్నానని తన మాటల్లో తెలియజేసింది.
మొత్తానికి నమితకు సరైన పాత్ర లభిస్తే గతంలో 'జగన్మోహిని' చేసినట్లు తెలుగులో కూడా చిత్రాలు చేసే అవకాశాలు ఉన్నాయని అర్ధమవుతోంది. ఇక ఈమె పెళ్లికి ముందు మోహన్‌లాల్ నటించిన 'పులిమురుగన్' చిత్రంలో చివరగా నటించింది. ఈచిత్రం తెలుగులోకి కూడా డబ్ అయిన విషయం తెలిసిందే.