తాజాగా ఎన్టీఆర్, పూజాహెగ్డే జంటగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'అరవింద సమేత'. దీనికి ట్యాగ్‌లైన్ అనాలో, లేక జంప్ లైన్ అనాలో గానీ 'వీరరాఘవ' అనే పదాన్ని కూడా పెట్టారు. ఇక ఈచిత్రం టైటిల్‌ని మొదట 'వీరరాఘవ' అని పెట్టినప్పటికీ 'అ..ఆ, అత్తారింటికి దారేది, అతడు' వంటి సెంటిమెంట్స్ దృష్ట్యా 'అ' అనే అక్షరంతో మొదలయ్యే సెంటిమెంట్‌ని బేస్ చేసుకుని ఈ టైటిల్‌ని పెట్టారని అర్ధమవుతుంది. కొందరికి మొదట్లో ఈ టైటిల్ సాఫ్ట్‌గా అనిపించినా కూడా 'అత్తారింటికి దారేది' తరహాలో ఎంతో పొయిటిక్‌గా ఉన్న ఈ టైటిల్ జనాలలోకి బాగానే దూసుకువెళ్తోంది.
అదే 'వీరరాఘవ' అని టైటిల్ పెట్టి జంప్ లైన్‌గా 'అరవింద సమేత' అని పెడితే అది పక్కా ఎన్టీఆర్ స్టైల్‌లో రొటీన్‌గా ఉండేది అనడంలో సందేహం లేదు. మన పెద్దలు కూడా వివాహ పత్రికలు, శుభలేఖలలోనే కాదు..మన దేవుళ్లను కూడా శ్రీదేవి సమేత, భూదేవి సమేత అంటూ ముందు భార్యతోనే మొదలుపెట్టడం అనేది తెలిసిందే. ఈ కోణంలో చూస్తే త్రివిక్రమ్ టైటిల్ సెలక్షన్‌ని ఎవ్వరూ తప్పుపట్టలేరు. సినిమా విడుదల నాటికి ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేయడానికి ఈ టైటిల్ బాగా ఊపు తెస్తుందనే చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌తో రఫ్‌గా కనిపిస్తున్న స్టిల్‌తో పాటు సాఫ్ట్ లుక్‌తో, క్లాసీగా ఉన్న పోస్టర్ కూడా అద్భుతంగా ఉంది.
ఇక ఈచిత్రంలో ఎన్టీఆర్ రెండు షేడ్స్ ఉండే పాత్రను చేయనున్నాడట. ఫస్టాఫ్‌లో ఎన్టీఆర్ ఎంతో క్లాసీ లుక్‌తో కనిపిస్తే, ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం ఫుల్ మాస్‌గా దుమ్మురేపుతాడని సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌కి ఇది సరైన టైమింగ్ కాకపోయినా త్రివిక్రమ్ సత్తాపై నమ్మకం ఉంచిన ఎన్టీఆర్‌కు హ్యాట్సాఫ్ చెప్పకతప్పదు.