సరదాగా నవ్వుతూ, తుళ్లుతూ, యాంకరింగ్ చేస్తూ, 'గుంటూరు టాకీస్' వంటి చిత్రాలతో యువత మతులు పోగొట్టే యాంకర్ కమ్ ఆర్టిస్ట్ రేష్మి గౌతమికి ఎప్పుడు రానంత కోపం వచ్చింది. పాపం.. ఈమె నటించిన 'నెక్ట్స్‌నువ్వే' చిత్రంపై ఈమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. యువి క్రియేషన్స్‌తో పాటు గీతాఆర్ట్స్, స్టూడియో గ్రీన్ వంటి సంస్థల నిర్మాణంలో వి4 క్రియేషన్స్‌పై వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలవడమే కాదు.. పెద్ద బేనర్లు కలిపి చేస్తున్న మొదటి చిత్రం కావడం, తనతోటి టివి నటుడు ప్రభాకర్ దర్శకత్వం వహించడంతో ఆమె భారీ ఆశలే పెట్టుకుంది. ఇక రేష్మి, అనసూయలు పోటాపోటీ యాంకర్లే అయినప్పటికీ ఇద్దరికీ మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. కానీ నటిగా అనసూయకి దక్కుతున్న అవకాశాలతో పోలిస్తే సినిమాలలో నటిగా రేష్మి గౌతమి కాస్త వెనుకపడే ఉందని చెప్పాలి.
ఇక విషయానికి వస్తే నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 'నాటా' నిర్వాహకులు తాము అమెరికాలో ఏర్పాటు చేస్తున్న ఓ వేడుకకు హీరో ప్రభాస్, దర్శకుడు శ్రీనువైట్లతో పాటు రేష్మి గౌతమి కూడా వస్తోందని ఫొటోలు ముద్రించి ఇన్విటేషన్‌ని వేశారు. తన పర్మిషన్ లేకుండా తన ఫోటోలు ముద్రించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నా అనుమతి లేకుండా నా ఫొటోలు ఎలా వేస్తారు? ఈ ఈవెంట్‌ని సంబంధించి నన్ను ఎవ్వరు సంప్రదించలేదు. నా అనుమతి లేకుండా నా ఫోటోలను వేయడం ఇదే మొదటిసారి కాదు. ఫొటో వేసేముందు అనుమతి పత్రాలను కూడా చెక్ చేయరా? అని అగ్గిమీద గుగ్గిలం అయింది. నిజానికి ఇది బాధ కలిగించే విషయమే.
సాధారణంగా ఎవరి పేర్లు, ఎవరి ఫోటోలో వేసేసి ఫలానావారు వస్తున్నారంటూ మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలా ప్రచారం చేసే సంస్థలు చాలా ఉన్నాయి. వారి పేర్లను చెప్పి క్రేజ్‌ని, స్పాన్సర్స్‌ని, టిక్కెట్ల అమ్మకాలను కూడా జరుపుతుంటారు. మరి ఇలాగే అమెరికాలో కాస్త గౌరవం ఉన్న సంస్థ ఇలా చేయడం మాత్రం తప్పేనని చెప్పాలి. మరి ఈ విషయంలో నిర్వాహకులు ఏం వివరణ ఇస్తారో వేచిచూడాల్సివుంది....!