తెలుగులో దాసరి నారాయణరావు శిష్యునిగా ఎన్నో చిత్రాలకు ప్రాణం పోసిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి. ఆయన కెరీర్‌లో ఆయనకు ఎన్నో మైలురాళ్లున్నాయి. ముఖ్యంగా నాడు ఆయన రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్‌గా 'పెదరాయుడు, చంటి' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ని అందించాడు. ఆయన కుమారుడు ఆది పినిశెట్టి తన మొదటి చిత్రం 'ఒక విచిత్రం'లో తేజ దర్శకత్వంలో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ఆయన పలు తమిళ చిత్రాలలో నటించి హిట్స్ కొట్టిన తర్వాత మనవారికి ఆయనలోని స్టామినా తెలిసి వచ్చింది.
ఇక 'సరైనోడు' నుంచి నిన్నటి 'రంగస్థలం' వరకు ఈ యువ నటుడు అన్ని పాత్రలను చేస్తూ మెప్పిస్తూ వస్తున్నాడు. ఇక ఈయన హీరోగా చేయాలనే నిర్ణయం తీసుకున్నాడని, ఆల్‌రెడీ తెలుగు ప్రేక్షకులలో కొంత గుర్తింపు రావడంతో ఆయన హీరోగా మరోసారి తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇక ఆది పినిశెట్టికి నాని హీరోగా వచ్చిన 'నిన్నుకోరి' కూడా మంచి గుర్తింపును తెచ్చిన చిత్రాలలో ఒకటి. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించింది. ఇప్పుడు అదే సంస్థ ఎంవీవీ సినిమా ఆర్ట్స్‌తో కలిసి ఆది పినిశెట్టి హీరోగా ఓ చిత్రం నిర్మించనుంది. ఇందులో తాప్సి, 'గురు' చిత్రం ద్వారా పరిచయమైన రితికా సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బహుశా ఈచిత్రాన్ని ద్విభాషా చిత్రంగా, తెలుగు, తమిళ భాషలు రెండింటిలో వర్కౌట్ అయ్యేలా నిర్మిస్తున్నారని అర్ధమవుతోంది.
ఇక ఈ చిత్రం టైటిల్‌ని ఈనెల 24వ తేదీన 11 గంటల 11 నిమిషాలకు నాని చేత అనౌన్స్ చేయించనున్నారు. నెగటివ్ షేడ్స్, పాజిటివ్ షేడ్స్..ఇలా అన్ని రకాల పాత్రల్లో మెప్పించిన ఆది పినిశెట్టికి హీరోగా ఈ రీలాంచింగ్ మూవీ అయినా కలిసి వస్తుందో లేదో వేచిచూడాల్సివుంది....!