అసలే తెలుగమ్మాయి కాని కీర్తి సురేష్‌ను సావిత్రి పాత్రకు ఎంపిక చేయడం పలువురి విమర్శలను ఎదుర్కొంది. ఇక ఈ చిత్రం కోసం కీర్తిసురేష్ తో పాటు దుల్కర్‌సల్మాన్ ప్రతిభను కూడా తక్కువగా అంచనా వేయలేం. అందరూ కీర్తి మాయలో పడ్డారు గానీ ఇందులో దుల్కర్ కూడా అద్భుతంగా నటించాడు. ఇద్దరు మలయాళీలు కావడంతో సినిమా సీన్స్ చిత్రీకరణ సందర్భంగా కీర్తి, దుల్కర్‌లు సీన్ గురించి తమిళం, లేదా మలయాళంలో ఒకరినొకరు చెప్పుకునే వారు. ఇక కీర్తిసురేష్‌తో పాటు దుల్కర్‌కి కూడా తమిళం, మలయాళమే వచ్చు గానీ తెలుగు రాదు. ఇక 'అజ్ఞాతవాసి'లో కీర్తిసురేష్ సొంతగా డబ్బింగ్ చెప్పినప్పటికీ అది కేవలం మామూలు చిత్రం. కాబట్టి 'మహానటి'లో సావిత్రి పాత్రకు కీర్తిసురేష్ ఎంత కష్టపడి సొంతంగా, ఫీల్ పోకుండా, సావిత్రిని గుర్తుతెచ్చేలా డబ్బింగ్ చెప్పడం మాత్రం సాహసమే. దాని కోసం. పదాలను స్వచ్చంగా పలకడం కోసం ఆమె పడిన కష్టాన్ని, ఆమె డబ్బింగ్ చెప్పిన వీడియోని తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఇక తమిళంలో కూడా 'నడిగైయర్‌తిలగం'కి కూడా కీర్తినే డబ్బింగ్ చెప్పింది. ఈ చిత్రానికి డబ్బింగ్ సొంతగా చెప్పినప్పుడు సావిత్రి వంటి మహానటికి నిజమైన నివాళులు అర్పించినట్లు. నిజంగా నేటి ఎందరో నటీమణులు ఏళ్లు గడుస్తున్నా డబ్బింగ్ మీదనే ఆధారపడుతున్నారు. ఇక సుమన్, రాజశేఖర్ వంటి వారు ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా అరువు గొంతుల మీదనే ఆధారపడుతున్నారు. నటనలో డైలాగ్స్ కూడా ఒక భాగం. అవి సొంతగా చెప్పిన నాడే పరిపూర్ణత వస్తుంది.
ఇక మమ్ముట్టికి తెలుగు రాకపోయినా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన 'స్వాతికిరణం' చిత్రంలో సొంతగా డబ్బింగ్ అందునా విశ్వనాథ్ దర్శకత్వంలో చెప్పి మెప్పించాడు. ఇక నేడు ఆయన తనయుడు కూడా అదే చేశాడు. ఇక ఈ చిత్రం కోసం సమంత కూడా ఎంతో కష్టపడి సొంతగా డబ్బింగ్ చెప్పిన విషయం కూడా గమనార్హం.