సావిత్రి బయోపిక్‌గా 'మహానటి'ని అనౌన్స్ చేసినప్పుడు కూడా ఈ చిత్రాన్ని కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ ఏమి తీయగలడు? పరభాషా నటి, వయసులో ఎంతో చిన్నదైన కీర్తిసురేష్ ఇంత బరువైన పాత్రను చేయగలదా? వరుస ఫ్లాప్‌ల వల్ల అశ్వనీదత్ వంటి వారి నిర్ణయాలు తప్పుగా మారుతున్నాయా? అనే పెద్ద చర్చ జరిగింది. చివరకు జమున వంటి వారు కూడా ఈ పాత్రను కీర్తిసురేష్ చేయడంపై పెదవివిరిచింది. ఈ విషయంలో కేవలం జముననే కాదు.. పలువురు సీనియర్లు కూడా ఇది సావిత్రికి పట్టిన దుర్గతి. ఈమె పేరును చెడగొట్టేలా ఉన్నారని విమర్శలు చేసిన వారు ఉన్నారు. కానీ కీర్తిసురేష్ మాత్రం ఆ విమర్శలకు నోటితో కాకుండా చేతలతోనే సమాధానం చెప్పింది.
ఇక ఈమె తాజాగా మాట్లాడుతూ, ఈ పాత్రలో నా నటన వెనుక కసి, కృషి, పట్టుదల, అవమానం, ఎగతాళి, విమర్శలు, వేదన, కంటితడి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నాడు విమర్శించిన వారికి నేను సమాధానం ఇచ్చాను. దక్షిణాదిలో మహత్తర నటి సావిత్రి. ఇలాంటి పాత్ర చేస్తేనే నటిగా పరిపూర్ణత లభిస్తుందని నాకు తెలుసు. కానీ నా కోరిక ఇంత త్వరగా నెరవేరుతుందని మాత్రం ఊహించలేదు. నాకు అవమానాలు కొత్తకాదు. 'తొడరి' చిత్రం చేసినప్పుడు ఎందరో నన్ను విమర్శించారు. ముఖ్యంగా నా నవ్వును కూడా పెడార్దాలు తీశారు. నాపై జరుగుతున్న ఈ కుట్రను నేనెందుకు పట్టించుకోవాలి. ఇక కొందరు సోషల్‌మీడియాలో విమర్శలు చేస్తూ వెక్కిరించేవారు. అప్పుడు ఓ గదిలోకి వెళ్లి బాగా ఏడ్చేసేదానిని. ఈ పాత్రలో నటించమని అమ్మ ధైర్యం చెప్పింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోవద్దని చెప్పింది. కానీ బయటి వారెవ్వరూ నాకు సపోర్ట్ ఇవ్వలేదు. విమర్శల వల్ల నాలో కసి పెరిగింది. ఎలాగైనా ఆ పాత్రలో జీవించి చూపాలని నిర్ణయించుకున్నాను.
సినిమా నటీనటులు జీవితంలోఒక కోణం మాత్రమే అందరికి తెలుస్తుంది. కానీ వారికి తెలియని రెండో కోణం ఉంటుంది. సావిత్రి పాత్రలో నటించడం ద్వారా అది ఏమిటి? అనేది ఎంతో తెలుసుకున్నాను. మా అమ్మ మేనక, బామ్మ సరోజ కూడా నటీమణులే. అక్క పార్వతి కూడా సినీరంగంలోనే ఉంది. నాన్న నిర్మాత. ఇలా మాది సినిమా కుటుంబమే. సావిత్రి గారు నిర్మాతగా, దర్శకత్వం కూడా వహించారు. కానీ నేను నిర్మాతగా మారను. దర్శకురాలినయ్యే అర్హత నాకు లేదని భావిస్తాను. ప్రేమ, పెద్దలు కుదిర్చిన పెళ్లా అంటే ఇప్పుడే ఏం చెప్పలేను. నాది ఇంకా చిన్నవయసు. ఇక మా అమ్మానాన్నలది కూడా ప్రేమ వివాహమే. భవిష్యత్తులో ఎవరినైనా ప్రేమిస్తే భయపడకుండా ఇంట్లో చెబుతాను. వారు ఒప్పుకుంటేనే వివాహం చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది.