దక్షిణాది బొద్దుగుమ్మనమిత అందరికీ సుపరిచితురాలే. ఈమె మొదట 'సొంతం, జెమిని' వంటి చిత్రాలలో చేసిన తర్వాత కోలీవుడ్‌కి వెళ్లి తన సత్తా చాటింది. ఆమె బొద్దు అందాలను చూసి ఎక్కువగా బొద్దువారిని ఇష్టపడే తమిళ ప్రేక్షకులకు ఆమె ఆరాధ్యదేవతగా మారిపోయింది. ఆమె పేరు మీద గుళ్లు, గోపురాలు కట్టడం కూడా జరిగింది. ఈమె ఇటీవల తన సహనటుడు వీరేన్‌చౌదరిని తిరుపతిలో గ్రాండ్‌గా వివాహం చేసుకుంది.
ఇక ఈమె పెళ్లికి ముందే 'పొట్టు' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఈనెల 25వ తేదీన విడుదల కానుంది. ఇక విషయానికి వస్తే నమిత వచ్చే ఎన్నికల నాటికి తమిళనాడు రాజకీయాలలో చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. దానికి మద్దతుగా ఆమె త్వరలో రాజకీయ నేపధ్యం ఉన్న చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. దాదాపు దశాబ్దం పైగా కేవలం అన్న, మామ, బాబాయ్ వంటి పాత్రలు చేస్తున్న తమిళ దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, నటుడు, స్టార్ శింబు తండ్రి టి.రాజేందర్ త్వరలో ఓ పొలిటికల్ థ్రిల్లర్‌ని తీయనున్నాడు. ఈ చిత్రంలో ఆయనే నటిస్తూ, స్వీయ దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఈ చిత్రం రజనీకాంత్, విశాల్ వంటి వారిని టార్గెట్ చేస్తూ, తమిళనాడులో ఏ పదవైనా తమిళులకే దక్కాలి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం చేస్తున్నారట.
ఇక టి.రాజేందర్‌కి తెలుగులో 'ప్రేమసాగరం, మైథిలీ నా ప్రేయసి' వంటి పలు డబ్బింగ్ చిత్రాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ఇక ఈయన చార్మి, నళిని, అమల, జీవిత వంటి ఎందరినో సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. మరి ఈ తాజా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రం రాజేందర్‌కి, నమితలకి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో వేచిచూడాల్సివుంది...!