విప్లవ నటుడు, నిర్మాత, రెడ్‌స్టార్ మాదాల రంగారావు నిన్న అనగా మే 19 తేదీ సాయంత్రం తీవ్ర అస్వస్థతతో, శ్వాసకోశ సమస్యతో బాధపడుతుండటంతో కుమారుడు డా.మాదాల రవి. రంగారావుగారి సతీమణి పద్మావతి స్టార్ హాస్పిటల్ (హైదరాబాద్)లో చేర్పించారు.
ఈ సందర్భంగా కుమారుడు డా.మాదాల రవి మాట్లాడుతూ.. పోయిన సంవత్సరం మే నెలలో తీవ్ర గుండెపోటు రాగా చెన్నైలోని విజయ హాస్పిటల్‌లో చేర్పించడం జరిగింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు అంబులెన్స్‌లో తరలించాము. డా.గోపీచంద్ గారు, వారి బృందం చాలా క్రిటికల్ గుండె ఆపరేషన్ చేసి నాన్నగారిని కాపాడారు. అప్పటి నుండి ఆయన హైదరాబాద్‌లోనే డా.రమేష్ గారు, డా.గోపీచంద్ గారు, డా. అనురాధగారి పర్యవేక్షణలో మా వద్దనే ఉంటున్నారు.
తిరిగి నిన్న మే 19న గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురి కాగా స్టార్ హాస్పిటల్‌లో చేర్పించాము. ప్రస్తుతం ఆయన పూర్తి వెంటిలేటర్ పై మరియు డయాలిసిస్‌లో ఐ.సి.యు లో ఉన్నారు. స్టార్ హాస్పిటల్ సిబ్బంది ఆయనను రక్షించడం కొరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో 48 గంటల పాటు పరిస్థితి విషమంగా ఉంటుందని తెలియజేశారు.
ప్రస్తుతం ఆయన వద్ద హాస్పిటల్‌లో రంగారావు భార్య శ్రీమతి పద్మావతి, కుమారుడు డా.మాదాల రవి ఉన్నారు.