ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ఫస్ట్ లుక్ బయటికి వచ్చేసింది. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 28 వ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా బయటికి వచ్చింది. త్రివిక్రమ్ మార్క్ కి భిన్నంగా ఎన్టీఆర్ మార్క్ కి దగ్గరగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా ఉంది. అరవింద సమేత అనే టైటిల్ కి వీర రాఘవ అనే క్యాప్షన్ తో ఎన్టీఆర్ 28 వ సినిమా టైటిల్ ఉంది. మరి టైటిల్ చూస్తుంటే క్లాస్ స్టయిల్లోనూ, క్యాప్షన్ చూస్తుంటే మాస్ స్టయిల్లోనూ ఉంది. నిన్న సాయంత్రం విడుదలైన అరవింద సమేత.. వీర రాఘవ టైటిల్ కి ఎంత స్పందన వచ్చిందో మాటల్లో చెప్పనలవి కాదు. అలాగే ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీకి కూడా అంతే స్పందన వచ్చింది.
ఎప్పుడు క్లాస్ స్టయిల్లో సినిమాలు చేస్తూ.. తనదైన డైలాగ్స్ తో అదరగొట్టే త్రివిక్రమ్ అజ్ఞాతవాసి విషయంలో మోసపోయాడు. కానీ ప్రస్తుతం తన క్లాస్ కి ఎన్టీఆర్ మాస్ కి ఏ మాత్రం తగ్గకుండా తాను చెయ్యబోయే ఎన్టీఆర్ ఫిల్మ్ ఉంటుందని ఒక్క టైటిల్ తోనే చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి టైటిల్ విషయంలో త్రివిక్రమ్ ఎంతో లోతుగా ఆలోచించి బోలెడంత టైం తీసుకుని ఊరించి ఊరించి మరీ టైటిల్ ఎనౌన్స్ చేసాడు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఎన్టీఆర్ టైటిల్ ని వెంటనే అంటే ఎన్టీఆర్ పుట్టిన రోజుకే విడుదల చేసేశాడు త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ అరవింద సమేత ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫస్ట్ లుక్ ని సినిమాలోని ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ నుండి తీసుకుననట్టుగా చెబుతున్నారు.
మరి ఈ భారీ యాక్షన్ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. అసలు ఎన్టీఆర్ సినిమాల్లో ఎప్పుడూ చూడని, అలాగే బడ్జెట్ పరంగా, ఇంకా టేకింగ్ పరంగా టాలీవుడ్ సినిమాల్లో చూడని విధంగా ఈ యాక్షన్ పార్ట్ ఉంటుందని చిత్ర బృందంలోని ఒకరు చెబుతున్న మాట. అయితే ఈ భారీయాక్షన్ సన్నివేశాన్ని సినిమా షూటింగ్ మొదట్లోనే చిత్రీకరించారని... ఈ సన్నివేశమే సినిమాకి హైలెట్ అంటున్నారు. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫుల్ యాక్షన్ హీరో అనేది ఫస్ట్ లుక్ లోనే తెలుస్తోంది. అరవిందగా పూజ హెగ్డే ఎలాంటి నటనతో ఆకర్షిస్తుందో మనకు పూజ ఫస్ట్ లుక్ లో తెలుస్తోంది.