దేశవిదేశాలలో ఎంతో ఆదరణ చూరగొన్న బిగ్‌బాస్‌షో ప్రాంతీయ భాషల్లో సక్సెస్ అవుతుందా? అందునా మాస్ మసాలాలు నిండివుండే ఈ షోకి ఉత్తరాది ప్రజలలాగా దక్షిణాది వారు పట్టం కడతారా? లేదా? అనే అనుమానాలు అందరిలో ఉండేవి. విశేషం ఏమిటంటే కాస్త అటు ఇటుగా ప్రారంభమైన తమిళ భిగ్‌బాస్‌కి కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తే, తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. కానీ తమిళం కంటే ఈ షో తెలుగులోనే బాగా క్లిక్ అయిందని చెప్పవచ్చు. ఇక కన్నడ కంటే కూడా తెలుగులోనే మంచి టీఆర్పీలు వచ్చాయి. దీనికి ఒక కారణం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ దీనిని తన స్పాంటేనియస్‌తో, జోకులు, మంచి కామెంట్రీతో ముందుకు నడిపించాడు. మొదటి సీజన్‌లో చెప్పుకోదగిన పార్టిసిపెంట్ లేకపోయినా, ఎన్టీఆర్ కేవలం శని, ఆదివారాలు మాత్రమే హోస్ట్‌లో కనిపించినా కూడా దీనికి వచ్చిన ఆదరణ చూస్తే ఏదైనా తీయాల్సిన విధంగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది.
ఇక బిగ్‌బాస్ సీజన్ 2కి కూడా యంగ్‌టైగర్‌నే తీసుకోవాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ వల్ల నో చెప్పడం, తమిళంలో మాత్రం కమలే హోస్ట్ చేస్తూ ఉండటంతో ఎన్టీఆర్‌కి సరితూగేలా ఎవరిని మన నిర్వాహకులు ముందుకు తీసుకుని వస్తారు? అనే ఆసక్తి మొదలైంది. చివరకు అన్నిచోట్ల నేచురల్ స్టార్ నాని పేరు మార్మోగిపోయింది. కానీ నాని మాత్రం ఇంకా నిర్వాహకులు తన వద్దకు కూడా రాలేదని, ఈ వార్తలు నిజం కాదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కానీ తాజాగా మాత్రం బిగ్‌బాస్ సీజన్2ని హోస్ట్ చేసేది నానినే అని తేలిపోయింది. ఈ విషయాన్ని నాని ట్విట్టర్‌లో కూడా తెలిపాడు. గరం గరం చాయ్ ముందు ఉంటే నాని కాస్త వంగి ఇచ్చిన స్టిల్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక నాని హీరోగా ఎలాంటి వివాదాలు లేని వాడు. మంచి వాక్చాతుర్యం కూడా కలిగిన వాడు కావడం, ఈ సారి పార్టిసిపెంట్స్‌గా మంచి మంచి ఇమేజ్ ఉన్నవారు ముందుకు రావడంతో ఈ సీజన్ 2 కూడా అదుర్స్ అనిపించేలా ఉంటుందా లేదా? అనేది వేచిచూడాల్సివుంది.
ఇక బిగ్‌బాస్ సీజన్1కి బిగ్‌బాస్ సెట్‌ను పూణెలో వేయగా, రెండో సీజన్‌కి మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్‌ని వేస్తున్నారు. త్వరలో ఈ ప్రోగ్రాం ప్రోమోలు కూడా విడుదల కానున్నాయి. ఈ షో కోసం నాని తన వరుస చిత్రాలను పక్కన పెట్టి చేస్తున్నందుకు 4కోట్ల పారితోషికం అందుకున్నాడని సమాచారం. మరి వచ్చే సీజన్ నాటికి విజయ్‌దేవరకొండ వంటి వారు కూడా ఈ పోటీలో నిలుస్తారనడంలో సందేహం లేదు.