6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొన్ని నెలల క్రితం 'ఎన్.ఆర్.ఐ సేవ ఫౌండేషన్' నమ్రత శిరోద్కర్ ని కలిసి ఏప్రిల్ 2012 నుండి తాము నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాల గురించి, సేవా కార్యక్రమాల గురించి వివరించారు. 45000 మందికి పైగా రోగులకు ఉచితంగా ఫీజియో థెరపీ వైద్యం అందించారు. అందులో 2500 మందికి పైగా పక్షవాతంతో మంచానికే పరిమితం అయినవారున్నారు. ఎన్నో సమస్యలతో బాధపడుతున్న పిల్లలకి కూడా వైద్యం అందించారు.
ఎంతో నిబద్దతతో 'ఎన్.ఆర్.ఐ సేవ ఫౌండేషన్' చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి నమ్రత ద్వారా తెలుసుకున్న మహేష్ బాబు ఈ సంస్థకి తన సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. దీనితో పాటు పేదరికంతో సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న క్రీడాకారుల కోసం 'ఎన్.ఆర్.ఐ సేవ ఫౌండేషన్' వారు నిర్వహిస్తున్న 'స్పోర్ట్స్ పెర్ఫార్మన్స్ అండ్ ఎన్ హాన్సమెంట్ సెంటర్' కి మహేష్ బాబు అండగా నిలబడి చేయూతని అందించారు. ఇందులో భాగంగా జాతీయ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించే దిశగా అవసరమైన స్పోర్ట్స్ రీహాబిలిటేషన్, గాయాల బారి నుండి ఎలా కాపాడుకోవాలో అవసరమైన తర్ఫీదు, ఫిట్నెస్ ట్రైనింగ్ ని గచ్చిబౌలి స్టేడియంలో అందించనున్నారు. మొదటి దశగా స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ సెంటర్ ని గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించారు. దీనితో పాటు ఎన్.ఆర్.ఐ సేవ సహాయంతో 'కమ్యూనిటీ డెవలప్ మెంట్ ప్రోగ్రాం' ని కూడా మొదలుపెట్టనున్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణలోని గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం అందించడంతో పాటు, ఆరోగ్యపరమైన జీవన శైలిని వారికి అలవాటు చేసే విధంగా నిర్వహిస్తారు.
ఎన్.ఆర్.ఐ సేవ వ్యవస్థాపకులు హరీష్ కొలసాని మాట్లాడుతూ, 'మహేష్ బాబు సహకారంతో 'ఎన్.ఆర్.ఐ సేవ' గ్రామాల్లో సేవ కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించగలుగుతుంది. గ్రామాల్లోని మహిళలు, పిల్లలు, వృద్ధులకు సహాయం అందిస్తూ వారితో పాటు స్థానికులని గ్రామాల అభివృద్ధిలో భాగం చేయాలనేది మా లక్ష్యం'.
ఈ సందర్భంగా హరీష్, మహేష్ బాబు, నమ్రతలు అందిస్తున్న సహాయం గురించి మాట్లాడుతూ, 'గత కొంత కాలంగా మహేష్, నమ్రతలు మా సంస్థకి ఎంతో సహాయం అందిస్తున్నారు. 'భరత్ అనే నేను' విడుదల సమయంలో ఈ విషయం గురించి చెప్తే, ప్రమోషన్ కోసం అనుకుని పొరబడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వెల్లడిస్తున్నాం. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం వారు అందించే సహాయం ప్రత్యక్షంగా చూశాక వారి గొప్పతనం అర్ధం అయింది. అలాంటి వారు మా సంస్థకి సహాయంగా నిలబడడం ఎంతో సంతోషంగా, గర్వంగా కూడా ఉంది'.