ఎన్నో నమ్మకాలతో హనురాఘవపూడి దర్శకత్వంలో భారీ వ్యయంతో ఎక్కువగా అమెరికాలో షూటింగ్ జరుపుకున్న 'లై' చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. యాక్షన్‌కింగ్ అర్జున్ వంటి వారు ఉన్నప్పటికీ ఈ చిత్రం సరిగా ఆడలేదు. కిందటి ఏడాది ఆగష్టు11న 'జయజానకినాయకా, నేనేరాజు నేనే మంత్రి' వంటి పోటీలో ఈచిత్రం విడుదల కావడం మైనస్ అయింది. ఇక తర్వాత నితిన్ తన సొంత బేనర్ శ్రేష్ట్‌మూవీస్, త్రివిక్రమ్, పవన్‌కళ్యాణ్‌లు నిర్మాతగా భాగస్వామ్యంతో తీసిన చిత్రం 'ఛల్ మోహన్ రంగ'. దీనికి త్రివిక్రమ్ స్వయాన కథను అందించాడు. ఈ చిత్రం హిట్ కొట్టడం గ్యారంటీ అనుకున్నారు. కానీ ఈచిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇక దిల్‌రాజుకి మొదటి చిత్రమైన 'దిల్' తర్వాత ఇంతకాలం గ్యాప్ తీసుకుని దిల్‌రాజు-నితిన్‌లు 'శ్రీనివాసకళ్యాణం' ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతంలో దిల్‌రాజు నిర్మాణంలో శర్వానంద్ హీరోగా సతీష్ వేగ్నేష్ దర్శత్వంలో వచ్చిన 'శతమానం భవతి' చిత్రం రికార్డులనే కాదు.. అవార్డులను కూడా పొందింది. దాంతో ఇప్పుడు అదే దిల్‌రాజు, సతీష్‌వేగ్నేష్‌లు కలిసి నితిన్, రాశిఖన్నా జంటగా ఈ 'శ్రీనివాసకళ్యాణం' రూపొందుతోంది. ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదట ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేయాలని భావించారు. కానీ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం, తర్వాత రీషూట్స్ వంటివి ఉంటాయనే ఉద్దేశ్యంతో తొందరపడి ఈచిత్రాన్ని విడుదల చేయకుండా ఆగష్టు 9వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు.
ఇక దిల్‌రాజు నిర్మాతగా సక్సెస్‌లు అందుకుంటున్నప్పటికీ డిస్ట్రిబ్యూటరుగా ఆయన రిలీజ్ చేసిన చిత్రాలు ఆయనకు భారీ నష్టాలనే మిగులుస్తున్నాయి. తాజాగా ఈ ఖాతాలోకి 'మెహబూబా' కూడా చేరింది. దాంతో ఈ చిత్రం నితిన్‌కి, దిల్‌రాజుకి, దర్శకుడు సతీష్‌వేగ్నేష్‌లకే కాదు 'తొలిప్రేమ' తర్వాత చిత్రం చేస్తున్న రాశిఖన్నాకి కూడా ఇది ఎంతో కీలకమైన చిత్రంగా చెప్పాలి.