జర్నలిస్ట్ భగీరథలో ఓ విలక్షణమైన రచయిత వున్నాడని, ఆయన రచించిన భగీరథ పథం చదివితే అర్ధమవుతుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పారు .
జర్నలిస్ట్ భగీరథ రచించిన 'భగీరథ పథం' పుస్తకాన్ని స్వామి బుధవారం నాడు హైద్రాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ భగీరథ ఎంత మంచి జర్నలిస్టో, అంతకు మించిన రచయిత కూడా అని, ఆయన నుంచి మరిన్ని పుస్తకాలు రావాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నానని అన్నారు .
శ్రీమతి జమున మాట్లాడుతూ.. తన జీవితాన్ని 'జమునాతీరం' పేరుతో రచించారని, ఆ పుస్తకం తనకి ఎంతో పేరు తెచ్చిపెట్టిందని చెప్పారు. భగీరథ పథం పుస్తకం చదివితే ప్రపంచం పట్ల ఆయనలో ఎంత అవగాహన ఉందో తెలుస్తుందని, చాలా విషయాలను నిష్పక్షపాతంగా రాసారని చెప్పారు. తనకి మహానటుడు ఎన్టీ రామారావు జాతీయ అవార్డు రావడానికి భగీరథ కారణమని.. జమున పేర్కొన్నారు .
నిర్మాత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. భగీరథ అంటే మా అందరికి ఎంతో ఇష్టమని, ఆయనలోని నిజాయితీ ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పారు. మరుగున పడ్డ వ్యక్తులు, ఘటనల గురించి భగీరథ మరిన్ని పుస్తకాలు రచించాలని చెప్పారు .
దర్శకుకు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. భగీరథ అనగానే మనకు సినిమా జర్నలిస్ట్ కనిపిస్తాడని, అయితే భగీరథ పథం చదివితే ఒక గొప్ప క్రిటిక్, ప్రపంచ విషయాలపై ఆయన సునిశిత ద్రుష్టి మనల్ని అబ్బుర పరుస్తుందని చెప్పారు .
నిర్మాత కె .అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. భగీరథ పథం పుస్తకం భగీరథ గారిలోని కొత్త కోణాన్ని తెలియజేస్తుందని, ఆయనలోని అవగాహన, స్పష్టత ఆయన్ని సరికొత్తగా చూపించాయని.. అన్నారు .
రచయిత సాయినాథ్ మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై భగీరథ గారికి వున్న అవగాహన చూసి ఆశ్చర్యపోయాను. ప్రతి ఆర్టికల్ అద్భుతంగా ఉందని చెప్పారు. మనకు ఈ పుస్తకం ద్వారా సరికొత్త భగీరథ కనిపిస్తాడని అన్నారు .
రచయిత్రి పల్లవి మాట్లాడుతూ.. భగీరథ గారు జీవితంలో చాలా కష్టాలు పడి పైకి వచ్చారని, అయితే ఆయన జీవితంతో ఎప్పుడూ రాజీపడలేదని చెప్పారు. ఆయన ఎప్పటికైనా దక్షిణ భారత చరిత్ర రాయాలని పేర్కొన్నారు .
సభకు అధ్యక్షత వహించిన సీనియర్ జర్నలిస్ట్, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శి టి. ఉదయవర్లు మాట్లాడుతూ.. భగీరథ, నేను ఇద్దరం కలసి పనిచేశాం. ఇద్దరి అభిప్రాయలు ఒకటి కావడంతో నాలుగు దశాబ్దాలుగా మా స్నేహం కొనసాగుతుంది. ఆయన జర్నలిస్టుగానే కాకుండా రచయితగా కూడా చాల మంచి పుస్తకాలు వెలువరించాడు. భగీరథ పథం అందరూ చదవతగ్గ పుస్తకము.. అన్నారు .
రచయిత భగీరథ మాట్లాడుతూ.. స్వరూపానందేంద్ర స్వామివారి చేతుల మీదుగా భగీరథ పథం ఆవిష్కరణ కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ స్పూర్తితో మరిన్ని రచనలు చేస్తానని చెప్పారు.