తెలుగులో కెరీర్ పరంగా కాకపోయినా కార్మిక సమస్యలు, ఇతర విషయాలలో దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్దగా తమ్మారెడ్డి భరద్వాజకు పేరుంది. అయితే ఆయనకు కొన్ని కారణాల వల్ల దాసరి, కృష్ణలతో విబేధాలు వచ్చాయి. వాటి గురించి తమ్మారెడ్డి చెబుతూ, సాధారణంగా దాసరి వద్దకు ఏదైనా కథ రాగానే ముందు నాకు చెప్పేవారు. సినిమా అయితే రషెష్ కూడా చూపించేవారు. ఇక ఒకరోజు ఆయన నన్ను పిలిచి రేలంగి నరసింహారావును పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. ఓ కథను రాయమని చెప్పారు. నేను కథ, డైలాగ్‌లు రేలంగికి ఇచ్చాను. రేలంగి నరసింహారావు ఆ కథ, మాటలను బెంగుళూరులో ఉన్నదాసరికి వినిపించారు. కానీ ఆ కథ నాకు నచ్చలేదని దాసరి అన్నారు.
ఆ తర్వాత అదే కథను, అదే టైటిల్‌తో మరో హీరో, దర్శకునితో తీస్తున్నట్లు దాసరి ప్రకటించారు. నేను ఆయన్ను కలుద్దామని వెళ్లినా ఆయన బిజీవల్ల నన్నుకలవలేదు. దాంతో నా ఇగో హర్ట్ అయింది. నీకథను వేరే వారు తీయడం ఏమిటని కొందరు నన్ను రెచ్చగొట్టారు. దాంతో నేను కూడా షూటింగ్ మొదలుపెట్టాను. ఇక ఇంటర్వ్యూలో దాసరి గురించి తీవ్రంగా మాట్లాడాను. దాంతో ఆయనకు కోపం వచ్చింది. ఆయన తరపు సన్నిహితులు, నా సన్నిహితులు కలిసి ఆ గొడవను సద్దుమణిగేలా చేశారు.
ఇక 'పచ్చని సంసారం' వంటి హిట్ తర్వాత కృష్ణగారి కోసం సత్యమూర్తి వద్ద మంచి కథ ఉందని తెలుసుకున్నాను. ఆ చిత్రమే 'రౌడీఅన్నయ్య'. అయితే ఈ చిత్రం మొదలయిప్పటి నుంచి క్లైమాక్స్‌కు ముందు వచ్చే పాట విషయంలో నాకు కృష్ణకి విబేధాలు వచ్చాయి. ఆ పాటను బాబూమోహన్‌పై తీయాలని నేను.. కాదు ఆ పాటలో తాను కనిపించాలని కృష్ణగారు పట్టుబట్టి కూర్చున్నాం. కానీ నేను కృష్ణకి తెలియకుండా ఆ పాటను తీసి సెన్సార్‌కి పంపాను. ఆ సెన్సార్ వారు ఆ పాట విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో సీన్‌లోకి కృష్ణ ఎంటర్ అయ్యారు. ఆయన సినిమాలో బాబూమోహన్ పాట ఉండటం చూసి, సెన్సార్ నుంచి బయటకి వచ్చి నాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి ఈ రోజుతో మన ఫ్రెండ్‌షిప్ కటీఫ్ అని చెప్పారు.. అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.