తెలుగు చిత్ర పరిశ్రమలోని నాటి దిగ్గజ నటీమణుల్లో సావిత్రి, జమునలను ముఖ్యంగా చెప్పుకోవాలి. వీరిద్దరు కలిసి పలు చిత్రాలలో నటించడమే కాదు.. నిజజీవితంలో కూడా అక్కాచెల్లెళ్లలాగా ఉండేవారు. ఇక తాజాగా జమున తన అక్కలాంటి సావిత్రి గురించి చెబుతూ, జెమిని గణేషన్‌ని పెళ్లి చేసుకోవాలనే తొందరపాటు నిర్ణయం సావిత్రి తీసుకున్నదని తెలిసి ఏయన్నార్ ఆమెని వారించాలని చూశాడు. కానీ ఆమె వినలేదు. ఆమెకు నాడు తండ్రి గైడెన్స్‌లేదు. తనకేం నచ్చితే అదే చేసేది. అదే సమయంలో ఆమె జెమినితో కలిసి కొన్ని చిత్రాలలో నటిస్తోంది. ఆమె వద్ద డబ్బు ఉంది. దాంతో జెమిని ఆమెని ట్రాప్ చేశాడేమో అనిపిస్తోంది. నాకు సావిత్రితోనే తప్ప జెమినితో పెద్దగా పరిచయం లేదు.
ఇక సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' వచ్చింది. ఈ చిత్రం అంత బాగా ఆడుతోందంటే సినిమా బాగా తీశారనే కదా అర్ధం. సావిత్రితో ఉన్న అనుబంధం కారణంగా ఆమెపై బయోపిక్ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాంటి సినిమా తీసిన టీమ్‌కు, సావిత్రిగా నటించిన కీర్తిసురేష్‌కి అభినందనలు తెలుపుతున్నాను. పూర్వం ఓ చిత్రం విడుదల అవుతోందంటే మాలాంటి వారిని పిలిచి మరీ ప్రీవ్యూ వేసేవారు. కానీ నేడు ఆ సంప్రదాయం లేదు. మీరొచ్చి ఈచిత్రం చూశారా? అంటే నేనేం సమాధానం చెబుతాను. నేను ధియేటర్‌కి వెళ్లి సినిమా టిక్కెట్ కొనుక్కుని థియేటర్‌లో చూసే అవకాశం లేదు కదా!
ఇక మా అబ్బాయిని ఉయ్యాలలో వేసేరోజు సావిత్రి పూర్తిగా మద్యం సేవించి మా ఇంటికి వచ్చారు. బాబుతో ఆడుకుని ఉయ్యాలలో పండుకోబెట్టారు. తర్వాత నారూమ్‌లోకి వచ్చి నన్ను కౌగిలించుకుని పెద్దగా ఏడ్చేసింది. నీకేం చెల్లి.. మంచిభర్త.. బంగారం లాంటి కొడుకు ఉన్నారు అని అంది. జెమిని ఇలా చేశాడు.. అలా చేశాడని చెప్పుకుని ఏడ్చింది. సావిత్రి కన్నీర్లు తుడిచి నాపక్కనే కూర్చోబెట్టుకున్నాను. జెమినినీ చేసుకోవద్దని అందరునీకు చెప్పారు. మోసపోతావని అన్నారు. అయినా వినిపించుకోకుండా బుట్టలో పడ్డావు. జరిగిందేదో జరిగిపోయింది. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక నీ జీవితానికి వారే సంతోషాన్ని ఇస్తారు అని ఓదార్చాను అని జమున చెప్పుకొచ్చింది.