గతంలో సుకుమార్ సినిమాలన్ని ఓ.. అన్నంత బంపర్ హిట్స్ కావు. కలెక్షన్స్ వచ్చినప్పటికీ.... అన్ని యావరేజ్ గానే ఉండేవి. కానీ సుకుమార్ తాజాగా పల్లెటూరి నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కించిన రంగస్థలం సూపర్ హిట్ అయ్యింది. కాదు కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రేంజ్ హిట్ ని కనీసం రామ్ చరణ్ గాని, సుకుమార్ గాని,. నిర్మాతలు గాని కలలో కూడా ఊహించి ఉండరు కూడా. అందుకే రంగస్థలం నిర్మాతలు ఈ సినిమాని టేబుల్ ప్రాఫిట్స్ తో అమ్మేశారు. అందుకే రంగస్థలం బయ్యర్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఇక నిర్మాతలు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ కూడా అమ్మేసారు. భారీ రేటుకి ఈ చిత్రం డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్‌కి ఇచ్చిన నిర్మాతలు నలభై అయిదు రోజుల తర్వాత ఆన్‌లైన్‌లో పెట్టేసుకోవచ్చని అగ్రిమెంట్ వారితో చేసుకున్నారు.
మరి భారీ రేటుకి కొన్న అమెజాన్ వారు రంగస్థలం సినిమా 45 రోజులు పూర్తయ్యిందో లేదో... టప్ మని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో రంగస్థలం సినిమాని పెట్టేసారు. మాములుగా ఈమధ్య ఏ సినిమా అయినా రెండు, మూడు వారాలకి మించి ఆడడం లేదు కనుక రంగస్థలం కూడా రెండు వారాల తర్వాత పెద్దగా కలెక్షన్స్ రావనుకుని.... మైత్రి మూవీస్ వాళ్లు భావించినట్టున్నారు.... అందుకే 45 రోజులకే అమెజాన్ లో పెట్టుకోమని చెప్పారు. కానీ రంగస్థలం సినిమా అంచనాలని మించిపోయి హిట్ అయ్యి ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ సాధిస్తోంది. మరి ఇప్పటికి వీకెండ్ హౌస్ ఫుల్ వుంటున్న సినిమాని అప్పుడే నెట్ లో పెట్టేస్తే ఇక కలెక్షన్స్ ఏం వస్తాయి. అందుకే అంత త్వరగా ఆన్‌లైన్ రిలీజ్‌కి ఇచ్చేసిన మైత్రి వారిపై మెగా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రంగస్థలం నిర్మాతలు అమెజాన్ వారిని మరో వారం ఆగి ఆన్‌లైన్ రిలీజ్ చెయ్యమని అడిగారట... కానీ ఒక్క సినిమాకి ఏదోలే అని వెసులుబాటు ఇస్తే... ఇకపై ప్రతి డీల్ బ్రేక్ చేయాల్సి వస్తుందని, ముందుగా చేసుకున్న ఒప్పందంలో మార్పు వుండదని తెగేసి చెప్పారట. మరి వారు చెప్పింది నిజమే. ఎన్నో లక్షలు, కోట్లు పోసి సినిమాని ఆన్ లైన్ రిలీజ్ కి కొన్నప్పుడు... వారికీ పెట్టుబడి పెట్టిన సొమ్ము తిరిగిరావాలిగా... వారి బాధ వారిది. ఏది ఏమైనా.. బడా సినిమాలు ఆన్ లైన్ రిలీజ్ లను ఒక రెండు నెలల గ్యాప్ తో పెట్టుకుంటే బావుంటుంది అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.