యంగ్‌స్టార్స్ కంటే ఫలితంతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేయడం బాలయ్యకే చెల్లుతుంది. ఆయన సినిమా ఒకసారి సెట్స్‌పైకి వెళ్లిందంటే రెండు మూడు నెలల్లో పూర్తికావడం గ్యారంటీ. సినిమా కోసం అంత అంకిత భావంతో ఆయన పనిచేస్తాడు. ఇక ఈయన తనతండ్రి బయోపిక్ 'ఎన్టీఆర్' చిత్రం విషయంలో తేజ తప్పుకోవడంతో ఆ చిత్రం ఏమి చేస్తాడు? కొనసాగిస్తాడా? తానే దర్శకత్వం వహిస్తాడా? అనే అనుమానాలు వస్తున్నాయి. అయినా 'మహానటి' వచ్చి బయోపిక్ అంటే ఇలా ఉండాలి అని నిరూపించింది. సావిత్రీ జీవితంలో చీకటి కోణాలు ఉన్నట్లే ఎన్టీఆర్ జీవితంలో కూడా ఉన్నాయి.
ఇక ఈ చిత్రం పనులను ఓవైపు చూస్తూనే మరోవైపు సి.కళ్యాణ్ నిర్మాతగా 'చెన్నకేశవరెడ్డి' తర్వాత వినాయక్ దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రం ప్రారంభించనున్నాడు. ఈ చిత్రం వినాయక్‌కి ఎంతో కీలకం. ఇక బాలయ్య చిత్రాలు మాస్ టచ్‌తో ఉంటాయి. వినాయక్ ఆ కోవకి చెందిన దర్శకుడే కాబట్టి ఈ చిత్రాన్ని తొందరగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇప్పటికే 'చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్రశాతకర్ణి, పైసావసూల్' తర్వాత ఇందులో నాలుగోసారి బాలయ్యకు జోడీగా శ్రియ నటించనుంది. వివాహం చేసుకున్న తర్వాత శ్రియ నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
ఇక బాలయ్య-వినాయక్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'చెన్నకేశవరెడ్డి' సరిగా ఆడలేదు. సినిమా పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ ఇందులో కుర్ర బాలయ్య పాత్ర సినిమాకి మైనస్ అయింది. ఆ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించాడు. కాగా ప్రస్తుత చిత్రం సి.కళ్యాణ్ నిర్మాతగా రూపొందనుంది. మరి ఈ చిత్రంతో బాలయ్య వచ్చే ఏడాది సంక్రాంతి హీరోగా మరోసారి నిరూపించుకుంటాడో లేదో వేచి చూడాల్సివుంది..!