ఎప్పుడో 40 ఏళ్ల కిందట తెలుగులో ఓ ఊపు ఊపిన నటి.. అందునా ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి వారి పోటీలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న మహానటి సావిత్రిని ఈ తరం ప్రేక్షకులు ఆదరిస్తారా? వారికి ఆమె గురించి తెలుసా? తెలుసుకోవాలనే తపన ఉంటుందా? అనే అనేక సందేహాలకు 'మహానటి' చిత్రం చెక్ పెట్టింది. ఇక ఈ చిత్రం విడుదలైన తర్వాత సావిత్రి జీవితానికి సంబంధించిన మరి కొన్ని విశేషాలను కూడా తెలుసుకునే పనిలో నేటి యువత ఉంది.
ఇక 'మహానటి' చిత్రంలో ఆమెకి గజరాజు అంబారి మీదకి ఎక్కించి చేసే సన్మానం జరిగింది హైదరాబాద్‌లోనే. ఇక తరుచు హైదరాబాద్‌కి చెన్నైనుంచి షూటింగ్‌ల కోసం వచ్చే సావిత్రి నాడు యూసఫ్‌గూడలోని ఒక ఎకరం స్థలం కొనుక్కుని, దానిలో తన అభిరుచికి తగినట్లుగా రెండు ఇళ్లను పక్కనపక్కనే నిర్మించారు. ఆమె షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అక్కడే దిగేవారు. నాటి హైదరాబాద్‌లోని పచ్చదనం.చెరువులు, తోటలు అంటే ఆమెకి ఎంతో ఇష్టం. దాంతో నేటి కృష్ణకాంత్‌పార్క్ ఉన్న ప్రాంతంలోని నాటిచెరువు కనిపించేలా ఆమె ఇల్లు బాల్కనీ ఉండేది. ఆ తర్వాత ఈ భవనాలు సావిత్రి సోదరి మారుతి భర్త మల్లికార్జునరావు సొంతం అయిపోయాయి.
ఈ భవనాల స్థానంలో ఈ స్థలంలో ఇప్పుడు పెద్ద అపార్ట్‌మెంట్ వెలిసింది.నాడు గర్వంగా అందరు సావిత్రి బంగళా అని పిలుచుకునే భవనాలు నేడు కానరాకుండా పోయాయి. మొత్తానికి ఈ అందమైనభవనాలు, వాటిని చెరువుని, పచ్చదనాన్ని, తోటలను చూసి మురిసిపోయిన ఆ ప్రకృతి ఆరాధకురాలి భవనాలు చరిత్ర గర్భంలోకలిసి పోయాయి. ఇది 1960 నాటి సంగతి మరి!