ఈ ఏడాది మొదట్లో పెద్ద సినిమాలు బోల్తా కొట్టినప్పటికీ... మార్చ్ నుండి మళ్ళీ పెద్ద సినిమాల హడావిడి మొదలైంది. రామ్ చరణ్ రంగస్థలంతో ఈ ఏడాది బిగ్ బోణి కొట్టాడు. మళ్ళీ ఆ రేంజ్ లోనే మహేష్ బాబు భరత్ అనే నేను తో గట్టి విజయాన్ని సాధించాడు. రంగస్థలం, భరత్ అనే నేను హవాలు ముగియక ముందే మహానటి తో నాగ్ అశ్విన్ భీభత్సమైన హిట్ కొట్టాడు. కేవలం 20 నుండి 30 కోట్ల బడ్జెట్ తో సినిమాని నిర్మించిన అశ్వినీదత్ కూతుళ్లు.. ఈ సినిమాతో భారీ మొత్తంలో వెనకేసుకోనున్నారు. నాగ్ అశ్విన్ ఎంతో చాకచక్యంగా... అందరిని మెప్పించేలా మహానటి సినిమాని తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ మీద బడా హీరోల కన్ను పడడమే కాదు... ప్రస్తుతం మెగా హీరోలు నాగ్ అశ్విన్ కి గేలం వేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి మహానటి టీమ్ ని అభినందించగా.. తాజాగా అల్లు అర్జున్ మహానటి టీమ్ కి మంచి ట్రీట్ కూడా ఇచ్చేసాడు.
ఇక ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న మహానటి మూవీ శాటిలైట్ హక్కులు నిన్నమొన్నటివరకు అమ్ముడు పోలేదు. విడుదలకు ముందు అశ్వినీదత్ చెప్పిన రేటుకు రెండు మూడు ఛానల్స్ పోటీపడినా అప్పుడు ఆ ఛానల్స్ ధైర్యం చేయలేకపోయాయి. కానీ సినిమా విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్నాక అశ్వినిదత్ చెప్పిన 10 కోట్ల శాటిలైట్ కాస్తా ఇప్పుడు 11 కోట్లకు అమ్ముడు పోయాయి. ఈ 11 కోట్లతో మహానటి శాటిలైట్ హక్కులను జి ఛానల్ వారు చేజిక్కించుకున్నారు. మరి ఈ రేటుకి మహానటి అమ్ముడు పోవడం అంటే మాములు విషయం కాదు. ఒక బడా హీరో సినిమా శాటిలైట్ హక్కుల రేంజ్ లో మహానటి హక్కులు అమ్ముడు పోయాయి. అలాగే అశ్వినీదత్ కి మహానటి పెట్టిన పెట్టుబడిలో సగం ఈ మహానటి శాటిలైట్ హక్కులు సంపాదించి పెట్టాయి. మరి గత బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి తో అశ్వినీదత్ కి భారీ లాభాలు వచ్చాయి అనడానికి ఈ శాటిలైట్ హక్కులే ఉదాహరణ.