మంచి చిత్రాలు తీస్తే చూడరని, మాస్, యాక్షన్ వంటివి ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని, ప్రయోగాలు చేయకుండా రొటీన్ కమర్షియల్ ఫార్ములాని ఎంచుకుంటేనే బెటర్ అని కొందరు మేకర్స్ ఘంటా పధంగా బల్లగుద్ది చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల వచ్చిన 'అర్జున్‌రెడ్డి, తొలి ప్రేమ, భాగమతి, ఫిదా, శతమానం భవతి, రంగస్థలం, భరత్ అనేనేను' వంటి చిత్రాలతో మనమేకర్స్‌లో ఉన్న చెడు అభిప్రాయం తొలగిపోయి ఉండాలి. అదే సమయంలో 'అజ్ఞాతవాసి, జైసింహా, నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా, ఇంటెలిజెంట్, మెహబూబా' వంటి చిత్రాల కలెక్షన్ల పరిస్థితి ఏమిటో కళ్లకు కడుతోంది. 'ఫిదా' వంటి చిత్రాలు ఎ సెంటర్లలో, మల్టీప్లెక్స్‌లలో బాగా ఆడుతాయని, 'జైసింహా'వంటి చిత్రాలు బిసీ సెంటర్లలో అదరగొడతాయని మన వారి అంచనా.
కానీ సావిత్రి బయోపిక్‌గా వచ్చిన 'మహానటి' ఎ,బి,సి సెంటర్లు మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్, మాస్, క్లాస్ అనే బేధం లేకుండా అన్నిచోట్లా కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇక ఈ చిత్రం తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే వారి ఆదరణను చూరగొంటోంది. ఇలాంటి మంచి సినిమాను పైరసీ సీడీలలో చూడమని, 'బాహుబలి' తరహాలో వెండితెరపైనే చూస్తామని యూత్ నుంచి ముసలి వారి వరకు అదే చెబుతున్నారు. ఇలా తెలుగు వారు దేవతగా కొలుచుకునే సావిత్రి బయోపిక్ సంచలనం సృష్టిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం యూఎస్‌లో మిలియన్ డాలర్స్‌క్లబ్‌లో చేరిపోయింది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ లెక్కల ప్రకారం తొలి నాలుగురోజుల్లో ఈ చిత్రం ఆస్ట్రేలియాలో 65లక్షలు, యూకెలో 26లక్షలు, న్యూజిలాండ్‌లో 5లక్షలు వసూలుచేసినట్లు తెలిపాడు. మొత్తానికి 'మహానటి'కి వచ్చేవారం కూడా భారీ పోటీ ఏదీ లేకపోవంతో ఈ చిత్రం పెట్టుబడితో పోల్చుకుంటే రెండురెట్లు కంటే ఎక్కువ వసూలు చేసి రూపాయికి రూపాయికి పైగా లాభం అందించడం ఖాయమంటున్నారు.