తినే ప్రతి బియ్యపు గింజ మీద తినే వాడి పేరు రాసిపెట్టి ఉన్నట్లు, చేసే ప్రతి పాత్ర మీద ఎవరు నటిస్తారో రాసి పెట్టే ఉంటుందని చెప్పాలి. ఈ సామెత కీర్తిసురేష్‌కి ఖచ్చితంగా అతుకుతుంది. ఆమె ధనుష్ నటించిన 'తొడరి' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇక తెలుగులో పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల 'అజ్ఞాతవాసి'లో నటించింది. ఈ రెండు చిత్రాలలో ఆమె నటనకు పలు విమర్శలు ఎదురయ్యాయి. ఇక 'గ్యాంగ్' చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. తాను మొదట నటించిన తెలుగు చిత్రం 'నేను..శైలజ' తప్ప ఆమెలోని నటిని ఏ చిత్రం బయటకు తీసుకుని రాలేకపోయింది.
కానీ సావిత్రి బయోపిక్‌గా రూపొందిన చిత్రంలో నాగ్ అశ్విన్ కీర్తిసురేష్‌ని ఎంపిక చేయడంతో కాస్త విమర్శలు కూడా వచ్చాయి. కానీ దర్శకుడి జడ్జిమెంట్ అద్భుతమని ఇప్పుడు అందరు ఒప్పుకుంటున్నారు. ఆమె ఈ చిత్రానికే పెద్ద హైలైట్‌గా నిలిచింది. నాటి సావిత్రిని మన కళ్లముందు ఆవిష్కరించింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆమె వల్ల సావిత్రి పాత్రకే కీర్తి ప్రతిష్టలు, నిండుదనం వచ్చాయని విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. ఆమెలోకి సావిత్రి ప్రవేశించి ఆ పాత్రను చేయించిందా? అనేంతగా కీర్తి ఇందులో లీనమై, పరకాయ ప్రవేశం చేసింది.
ఇప్పటికే చిరంజీవి, మోహన్‌లాల్ వంటి వారి ప్రశంసలను పొందిన ఆమెని తాజాగా లోకనాయకుడు, విశ్వనటుడు కమల్‌హాసన్ పిలిచి మరీ అభినందించాడు. మిగిలిన వారి పొగడ్తల కంటే కమల్ ఇచ్చిన ప్రశంస కీర్తికి అరుదని చెప్పవచ్చు. కమల్‌హాసన్ సావిత్రి నటించిన 'కలత్తూరుకన్నమ్మ' చిత్రం ద్వారా బాలనటునిగా తెరంగేట్రం చేశాడు. కేవలం ఫేస్ ఫీలింగ్స్‌తో నటన ఎలా చేయాలో సావిత్రి ఆయనకు నేర్పారు. ఇక కీర్తిసురేష్ నటించిన కొన్ని సీన్స్‌ని కమల్‌హాసన్ ప్రత్యేకంగా ప్రస్తావించి, ఆమెకి అభినందనలు తెలపడం గర్వించడగ్గ విషయం.