దశాబ్దంపైగా ఎలాంటి హిట్‌లేక నానా అవస్థలు పడుతున్న రాంగోపాల్‌వర్మని నమ్మి నాగార్జున చాన్స్ ఇచ్చాడు అనగానే ఒక్కసారిగా అందరు ఉలిక్కిపడ్డారు. అందునా ఈ చిత్రం బాగానే ఉన్నా కూడా ఫ్లాప్‌టాక్ తేవడానికి మెగా ఫ్యాన్స్ కూడా సిద్దంగా ఉన్న తరుణంలో మెగా ఫ్యాన్స్ బాగానే ఆదరించే నాగ్ ఈ చిత్రం చేస్తుండటం విశేషం. ఇక 'శివ, అంతం, గోవిందా గోవిందా' తర్వాత ఎంతో గ్యాప్ తర్వాత నాగ్-వర్మ చేస్తున్న 'ఆఫీసర్' ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇప్పటికే రెండు టీజర్లు రిలీజ్ చేయగా వాటికి పెద్ద స్పందన రాలేదు. అయినా ఆరెండు టీజర్లను కలపి, వాటికి కొనసాగింపుగా ఈ ట్రైలర్‌ని కట్ చేసినట్లుగా ఉంది.
ఇక ప్రతి మనిషిలోనూ దేవుడు, రాక్షసుడు ఇద్దరు ఉంటారు అని మొదటే వర్మ తానేం చెప్పదలుచుకున్నాడో చెప్పేశాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన నాగార్జున ఓ అధికారి హత్య కేసు విచారణ కోసం హైదరాబాద్ నుంచి ముంబై వస్తాడు. ఇక ముంబై అంటే వర్మ స్టైల్‌లో అక్కడ మాఫియా ఖచ్చితంగా ఉండి, నాగార్జునకు అడ్డంకిగా నిలుస్తారు. ఈ మాఫియా నుంచి ఆ పోలీస్ ఆఫీసర్‌కి ఎదురైన అనుభవాలు, హీరో కేసును ఛేదించడం ఇందులో కనిపిస్తోంది. ఇక ఆ అధికారికి ఓ పాపని పెట్టడం ద్వారా వర్మ తనకి నచ్చని సెంటిమెంట్, ఎమోషన్స్‌ని కూడా చూపిస్తున్నాడని అర్ధం అవుతోంది.
మొత్తానికి యాక్షన్-సెంటిమెంట్-వయెలెన్స్‌ని మిక్స్ చేసి వర్మ ఈ ట్రైలర్‌ని రూపొందించాడు. ఇక గ్లామర్ కోసం మైరా సరీన్ పాత్రని కూడా బాగానే వాడుకున్నాడు. మొత్తానికి ఈ టీజర్లకు, ట్రైలర్లకు ఎందుకు స్పందన రాలేదో పవన్ ఫ్యాన్స్‌ని అడగాలని కూడా పవన్ ఫ్యాన్స్‌ని మరోసారి వర్మ రెచ్చిగొట్టి తనదైనశైలిలో ముందుకు వెళ్తున్నాడు. ఇక ఈచిత్రం మే25న విడుదల అవుతుందని చెప్పినా, ట్రైలర్‌లో మాత్రం కమింగ్‌సూన్ అని ఉండటంతో ఏమైనా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానం వస్తోంది.