దేశంలోని అన్నిరంగాలు భ్రష్టుపట్టిపోయాయి. ఇందులో సందేహాలు లేవు. ముఖ్యంగా నేటి ప్రజలు మీడియా వైఖరిని తప్పుపడుతున్నారు. అన్ని మీడియాలు అదే తరహాలో ఉండవు. అసలు ఓ సమస్య తలెత్తినప్పుడు దానిని రిపోర్ట్ చేసి పది మంది పెద్దలతో చర్చలు పెట్టడం ముఖ్యం. ఇది మీడియా బాధ్యత. అది సినిమా రంగమైనా, రాజకీయం అయినా , ఏదైనా సరే...తమ దృష్టికి వచ్చిన అంశాలపై ఆయా రంగాల నిపుణులతో చర్చలు పెట్టడం ద్వారా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఆయా చర్చల్లో లేవనెత్తిన అంశాలలోని మంచిని తీసుకుని, వితండవాదాన్ని పక్కన పెట్టడం వల్ల జనం జాగరూకత వహించే అవకాశం ఉంటుంది.
కానీ అసలు తమ రంగంలోని అంశాలపై చర్చ పెట్టడమే తప్పు అంటే ఎవరూ ఏమి చేయగలిగింది లేదు. తమ తప్పులను తమలోనే ఉంచుకుని, మేడిపండులా అందరి ముందు పెద్దతరహాలో ఉండాలని కోరుకోవడం అవివేకం అవుతుంది. ఇక గత కొంతకాలంగా మీడియాలో కాస్టింగ్‌కౌచ్‌లు గురించి చర్చ సాగుతోంది. ఈ విషయంలోనే కాదు డ్రగ్స్, నిర్భయ వంటి ఘటనలను కూడా మీడియా బాగా హైలైట్ చేసి అందరిలో చర్చజరిగేలా చూస్తోంది. కొన్ని చర్చలు రచ్చలుగా మారడం కూడా నిజమే.
ఇక కాస్టింగ్‌కౌచ్ గురించి మాట్లాడితే ఇది నిజమా? కాదా? అనేది చెప్పకుండా సినిమా వారినే ఫోకస్ చేస్తున్నారని విమర్శించడం తగదు. ఇక ఇదే అభిప్రాయాన్ని యాంకర్, నటి రేష్మిగౌతమ్ మాట్లాడుతూ, అన్నిరంగాలలో ఉన్నప్పుడు మమ్మల్నే హైలైట్ ఎందుకు చేస్తున్నారు? దీనికి నివారణ ఆలోచించాలని అంటోంది. మరి ఈమె చెప్పే నివారణ మంత్రం ఏమిటో చూడాలి..!